ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 15, 2020 , 23:25:03

రూ.200 కోట్లు చెల్లించాలి

రూ.200 కోట్లు చెల్లించాలి
  • 2007 నుంచి ఇప్పటివరకు కార్పస్‌ ఫండ్‌ చెల్లించని కంపెనీలు
  • ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, పీసీబీ అధికారులతో ఎంపీ సమీక్ష
  • బల్క్‌డ్రగ్‌ కంపెనీలకు నోటీసులివ్వాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశం
  • కంపెనీలకు సామాజిక బాధ్యత ఉంది

(సంగారెడ్డి ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ) : పర్యావరణ పరిరక్షణను సా మాజిక బాధ్యతగా స్వీకరించాలని  బల్క్‌డ్రగ్‌ కంపెనీ యా జమాన్యాలకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ప్రతి ఏటా సంస్థ టర్నోవర్‌లో 0.5శాతం కార్పస్‌ ఫండ్‌ కింద బల్క్‌డ్రగ్‌ కంపెనీలు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ)కి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లా లో చాలా పరిశ్రమలు 2007 నుంచి కార్పస్‌ ఫండ్‌ చెల్లించడం లేదు. తమ వ్యాపారాలు సాగించుకుంటున్న పరిశ్రమలు.. కార్పస్‌ ఫండ్‌ చెల్లించడంలో మాత్రం నిర్ల క్ష్యం వహించడం ఎంత వరకు సమంజసమని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు బల్క్‌ డ్రగ్స్‌ పీసీబీకి బకాయిపడిన దాదాపు రూ.200 కోట్ల వరకు కార్పస్‌ ఫండ్‌ను తక్షణమే చెల్లించాలని ఆదేశించారు.

ఈ మేరకు బకాయిలు పడ్డ పరిశ్రమలకు వెం టనే నోటీసులు జారీ చేయాలని పీసీబీ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి శనివారం పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీవ్‌శర్మ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మతో పాటు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు పీసీబీ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. బల్క్‌డ్రగ్‌ కంపెనీలు కార్పస్‌ ఫండ్‌ చెల్లించాలని ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఫండ్‌ చెల్లించి పీసీబీ యంత్రాంగానికి కంపెనీలు సహకరించాలని సూచించారు. కంపెనీలు అందించే ఫండ్‌తో ఎస్‌టీపీ, ఈటీపీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మాణం చెప్పాట్టాల్సి ఉంటుందని, అలాగే పరిశ్రమల ప్రాంతంలో ఆసుపత్రి నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉందన్నారు. భూగర్భజలాల పొల్యూషన్‌ కాకుండా చూడాలన్నారు. ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. 

 ఇదిలా ఉండగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాలని పీసీబీ అధికారులకు ఎంపీ సూచించారు. బల్క్‌డ్రగ్స్‌ కంపెనీల నుంచి కచ్చితంగా కార్పస్‌ ఫండ్‌ వసూలు చేయాలని ఆదేశించారు. 


logo