మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 15, 2020 , 23:24:09

40 పడకల డయాలసిస్‌ దవాఖానకు కృషి

40 పడకల డయాలసిస్‌ దవాఖానకు కృషి


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజల అవసరాల దృష్ట్యా సిద్దిపేట లో 40పడకల డయాలసిస్‌ దవాఖానగా విస్తరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా దవాఖానలో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి రూ.10 లక్షలతో ఆప్తమాలజీ ఆపరేషన్‌ థియేటర్‌, రూ.10 లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషన్‌, రూ.20 లక్షలతో సింగిల్‌ పర్సన్‌ ప్లేట్‌లెట్‌ సెంటర్‌ మిషనర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో జిల్లాలో కంటి ఆపరేషన్‌ థియేటర్‌ లేక, కంటి సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు తీరాయని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్‌లో కంటి ఆపరేషన్‌ థియేటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కంటి చూపుతో బాధపడేవారు, కంటి సమస్యలు ఉన్న వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.20 లక్షలతో సింగిల్‌ పర్సనల్‌ ప్లేట్‌లెట్స్‌ సపరేట్‌ను ప్రారంభించుకున్నట్లు వివరించారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఇది వరకు ఐదు పడకల డయాలసిస్‌ సెంటర్‌ మాత్రమే ఉండేదని, ప్రజల అవసరాల మేరకు 10 పడకలను విస్తరించామని చెప్పారు.

ప్రజల అవసరాల దృష్ట్యా 40 వరకు డయాలసిస్‌ పడకల దవాఖానను విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైద్య సేవలు మెరుగ్గా అందడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 పడకలతో ఐసీయూ సెంటర్‌ ఉన్నదని, దానిని 20 పడకల ఐసీయూ సెంటర్‌గా త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ ఆరసి, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్‌, ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo