శనివారం 30 మే 2020
Siddipet - Feb 14, 2020 , 23:11:49

సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున లక్ష మొక్కలు

సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున   లక్ష మొక్కలు
  • విరివిగా నాటాలని మంత్రి హరీశ్‌రావు పిలుపు
  • నర్సరీల నుంచి మొక్కల పంపిణీ ప్రారంభం
  • ఈనెల 17వ తేదీన ఉద్యమంలా హరితహారం
  • జిల్లా వ్యాప్తంగా గుంతలు తీసే పనులు ముమ్మరం
  • సుడా పరిధిలో ‘శార్వరి గ్రీన్‌ పార్కు’ ప్రారంభోత్సవం
  • మున్సిపాలిటీల్లో ఐదు వేల చొప్పున నాటేలా కార్యాచరణ
  • గ్రామాల్లో 200, మండల కేంద్రాల్లో 300 మొక్కలు

ఆకుపచ్చని తెలంగాణ కోసం పరితపిస్తున్న హరిత సాధకుడు సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి. ఈనెల 17న ముఖ్యమంత్రి జన్మదినం  సందర్భంగా  ఊరువాడా తేడాలేకుండా ప్రతిచోట మొక్కలు నాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా హరిత ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. దీంతో సుడా ఆధ్వర్యంలో సిద్దిపేటలో, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ముమ్మరంగా గుంతలు తీసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులతోపాటు ఏ గ్రామానికి ఏ నర్సరీ నుంచి మొక్కలు తరలించాలి, తదితర పనులు నిర్వహించేందుకు అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. సోమవారం ఉదయం జిల్లావ్యాప్తంగా ఉద్యమంలా హరితహారం చేపట్టనున్నారు. మొక్కలు నాటడమే కాదు..వాటిని రక్షించేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో 200, మండల కేంద్రాల్లో 300, ప్రతి మున్సిపాలిటీలో 5 వేల చొప్పున మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నారు. మెతుకుసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజున జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి బర్త్‌డే కానుక ఇవ్వాలన్నది మంత్రి హరీశ్‌రావు ఆలోచన. ఇందుకనుగుణంగా రేపు సాయంత్రం వరకు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా కానున్నాయి.  

సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమ విజయవంతానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్లుండి(సోమవారం) ఉదయం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావుకు ఆదేశాలు జారీ చేశారు. సుడా పరిధిలో ‘శార్వరి గ్రీన్‌ పార్కు’ను ప్రారంభించనున్నారు. మొక్కలు నాటేందుకు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, సుడా పరిధిలో గుంతలు తీసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు మొక్కల సరఫరా చేయనున్నారు.

(సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ) :

సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 499 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులతో పాటు ఏ గ్రామానికి ఏ నర్సరీ నుంచి మొక్కలు తరలించాలి. తదితర పనులు చేపట్టేందుకు అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించి పక్కాగా పనులు చేపడుతున్నారు. శుక్రవారం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంతలు తీసే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 17న ఉదయం ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టనున్నారు. ప్రతి గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లేలా మొక్కలు నాటి వాటిని సంరక్షించనున్నారు. ఇప్పటికే గత నాలుగు విడుతల్లో హరితహారం కింద మొక్కలు నాటి జిల్లాను రాష్ట్రంలోనే హరితహారంలో నంబర్‌-1గా నిలిపారు. సిద్దిపేట ముద్దు బిడ్డ, సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి, జన్మదిన కానుకగా ఇవ్వాలన్నది మంత్రి హరీశ్‌రావు ఆలోచన. అందుకనుగుణంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వివిధ రకాల మొక్కలను నాటనున్నారు. 

ప్రతీ జీపీ పరిధిలో 200 మొక్కలు

జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటుతా రు. రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటనున్నారు. ఆ యా గ్రామాల్లోని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సంఘాలు, స్థానిక అధికారులు సమన్వయంతో కలిసి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 200 మొక్క లు, మండల కేంద్రాల్లో 300 మొక్కలను నాటాలన్నది ల క్ష్యం. ఈ మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న నర్సరీ నుం చి నాలుగైదు రకాలకు చెందిన మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఇప్పటికే గుంతల తీత ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ప్రతి మున్సిపాలిటీలో ఐదు వేలు..

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలుండగా, ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో 5 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టణ ప్రగతి సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆయా మున్సిపాలిటీల కౌన్సిలర్లు, చైర్మన్లకు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు ఆయా మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

సుడా పరిధిలో 5,900..

సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) ఆధ్వర్యంలో 5,900 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండున్నర మీటర్ల ఎత్తులో ఉన్న 12 రకాల మొక్కలను రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. ఈ మేరకు సుడా అధికారులు అక్కడకు వెళ్లారు. వేప, తబుబియా, కదంబ, ఫ్లవర్‌ప్లాంట్స్‌ తదితర మొక్కలు తీసుకొస్తున్నారు. సుడా పరిధిలో 14 జోన్లుగా విభజించి, ఆయా జోన్లకు అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. సుడా వైస్‌ చైర్మన్‌ రమణాచారి ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున సుడా కార్యాలయం ముందు ‘శార్వరి గ్రీన్‌ పార్కు’ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.


లక్ష మొక్కలు కానుకగా ఇద్దాం..

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుదాం. ఈ హరితహారం కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువత, అన్ని వర్గాల ప్రజలు, అధికారులు భాగస్వాములై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 499 పంచాయతీలున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావుకు ఆదేశాలిచ్చాం. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


logo