ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 14, 2020 , 23:07:26

నూతన మున్సిపల్‌ చట్టంతో మేలు

నూతన మున్సిపల్‌ చట్టంతో మేలు
  • మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య

    దుబ్బాక టౌన్‌ :  ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మున్సిపల్‌ చట్టాన్ని తూచా తప్పక అమలు చేస్తామని దుబ్బాక మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య తెలిపారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గన్నె వనితభూంరెడ్డి అధ్యక్షతన కౌన్సిలర్లకు నూతన మున్సిపల్‌ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కౌన్సిలర్లకు మార్గనిర్దేశం చేస్తూ..మున్సిపాలిటీలోని వార్డుల్లో వంద శాతం చెత్త సేకరణ జరుగాలన్నారు. డంపింగ్‌ యార్డుల కోసం ఈ నెలాఖరులోగా స్థలాన్ని సేకరించాలని సూచించారు. అదేవిధంగా అవసరమున్న చోట పబ్లిక్‌ మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ పారిశుధ్య సమస్యలు, నీరు, లైటింగ్‌ సమస్యలను పరిశీలించాలన్నారు. మున్సిపల్‌ బడ్జెట్‌ రూపొందించడంలో ప్రణాళికబద్దమైన మార్గనిర్దేశం చేశామని జీతభత్యాలు, వీధిదీపాల బిల్లు, మంచినీటి సరఫరా బిల్లు, అప్పులు చెల్లింపులు, మొక్కలు నాటేందుకు గ్రీన్‌ బడ్జెట్‌ రూపంలో 10 శాతం కేటాయింపు, పారిశుధ్య అవసరాలకు పోగా మిగిలిన బడ్జెట్‌తో అభివృద్ధి పనులు చేస్తామని కౌన్సిలర్లకు కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య వివరించారు. 

 ఐక్యంగా పని చేద్దాం... ఆదర్శంగా నిలుద్దాం : చైర్‌పర్సన్‌ గన్నె వనిత

    నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం అందరం బాధ్యులమేనని ఐక్యంగా పని చేసి దుబ్బాక మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని కౌన్సిలర్లకు చైర్‌పర్సన్‌ గన్నె వనిత పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశానుసారం నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గానికి తోడుగా వార్డుల్లో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. యూత్‌ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్‌ సిటిజన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులుండాలని వార్డు కౌన్సిలర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారని కౌన్సిలర్లకు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, మట్ట మల్లారెడ్డి, దివిటి కనకయ్య, బాలకృష్ణ, బత్తుల స్వామి, ఆస యాదగిరి, దేవుని లలిత ఉన్నారు.   


logo