రుతువులు ఎలాగైతే తిరిగి తిరిగి వస్తాయో.. ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా అలాగే! పాత అనుకున్న ట్రెండ్స్ మళ్లీ పురుడు పోసుకొని ష్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తాయి. వీటిని యాంటిక్ జ్యువెలరీ కోటాలో వేసి ఆనందిస్తారు డిజైనర్లు. ఈ జాబితాలో చిల్లర నగలు వచ్చి చేరాయి. చారాణా, ఆఠాణా వాడకంలో కనిపించకపోయినా.. నగల్లో చేరి నిగనిగలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయికి మారకం విలువ పతనం అవుతున్నా.. ఆభరణాల్లో అందంగా కొలువుదీరి మంచి ధర పలుకుతున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ కరెన్సీ నగలకు ప్రాణం పోస్తూ.. కొత్త ట్రెండ్‌కు దారి చూపుతున్నారు. గతంలో గిరిజనులు పదిపైసలు, ఐదుపైసల బిళ్లలతో కాసుల పేర్లు, ఉంగరాలు చేసుకొని వేసుకునేవారు. ఆ సంప్రదాయాన్ని వారు మానుకున్నా, ట్రైబల్ జ్యువెలరీ పేరుతో అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. బామ్మలు ధరించిన ఈ తరహా నగలను ఈ తరం భామలు వేసుకోవడం విచిత్రమే కదా!