సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 12, 2020 , 23:26:44

ప్రగతి బాటలు

ప్రగతి బాటలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా స్థాయిలో నిర్వహించే పంచాయతీ రాజ్‌ సమ్మేళనాల్లో కొత్తగా వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంతో పాటు మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పిస్తారు. కాగా, మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాలో 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాలపై వరుస సమీక్షలు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేశారు. రాష్ట్రంలోనే పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదర్శంగా నిలిచింది. అక్టోబర్‌లో నిర్వహించిన 30 రోజుల కార్యక్రమం, జనవరి మాసంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో జిల్లా ఉన్నతాధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో సంఘటితంగా గ్రామాలను అద్భుతంగా తయారు చేశారు. పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామాలు అద్భుతంగా తయారవుతున్నాయి.


 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. ప్రతి గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలన్నీ పచ్చదనంతో పరిఢవిల్లేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామాల్లో మొక్కలు ఎండిపోకుండా పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం బాధ్యతలు పెట్టింది. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను అందించింది. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పట్టణాల్లో పురపాలక సమ్మేళనాలు నిర్వహిస్తారు. వార్డుకు ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించనున్నది. ఆ వార్డుకు పూర్తిగా బాధ్యత వహించనున్నారు. ఆయా వార్డుల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. వీరంతా ఆ వార్డులో పర్యటించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. గ్రామాల్లో ఎలా అయితే చేపట్టారో అదే మాదిరిగా పట్టణాల్లో కూడా చేపట్టనున్నారు. 


logo