మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 12, 2020 , 23:24:04

సిరిమంతుడు మల్లికార్జునుడు

సిరిమంతుడు మల్లికార్జునుడు

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ఘననీయంగా ఆదాయం పెరుగుతుండడంతో ఆలయ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  మల్లన్న క్షేత్రంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆలయ అధికారులు, కమిటీ చైర్మన్‌, సభ్యులకు ప్రత్యేక సూచనలు, ఆదేశాలు ఇస్తుండడంతో భక్తులకు సకల వసతులు కల్పిస్తుండడంతోపాటు ఆదాయం సైతం పెరుగుతున్నది. భక్తుల ఆదరణతో కోరమీసాల స్వామి కోట్లకు పడుగెత్తుతున్నారు. ప్రతి యేడాది కేవలం బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జీత సేవలు, ఇతర కార్యక్రమాలతో ఆదాయం వచ్చేది. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు  మల్ల న్న క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం 365 రోజుల్లో ప్రతి ఆదివారం ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బ్రహ్మోత్సవాల సమయంతో పాటు మిగిలిన ఆదివారాల్లో ఆదాయం భారీగా పెరుగుతున్నది. నవంబర్‌ 22వ తేదీన నిర్వహించిన రాజగోపుర కుంభాభిషేకం, డిసెంబర్‌ 22వ తేదీన మల్లన్న కల్యాణోత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3,94,63,855 ఆదాయం వచ్చింది. ఇందులో 4 ఆదివారాల్లో ఆర్జీత సేవల ద్వారా రూ. 2,12,17,364, హుండీ ద్వారా రూ.1,82,46,491 ఆదా యం సమకూరింది. భక్తులకు ఆలయం ద్వారా అందించే సేవలు ఆర్జీత సేవలు (గదులు, ప్రసాదాల కొనుగోలు, కల్యాణ మొక్కులు, ముఖఃమండపం, నజరు, చిలుక పట్నం, తలనీలాల సమర్పణ, అభిషేకం, పట్నం మొక్కులు) ద్వారా ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. కాగా, బ్రహ్మోత్సవాలు మరో 6 ఆదివారాలు ఉండడంతో ఆదాయం రెట్టింప య్యే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.


 కుంభాభిషేకం నుంచి పెరుగుతున్న ఆదాయం

గత సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన రాజగోపుర కుంభాభిషేకం, డిసెంబర్‌ 22న కల్యాణం, పట్నం, లష్కర్‌, 3, 4 ఆదివారాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ సంతోష్‌, ఈవో వెంకటేశ్‌, ఏఈవో సుదర్శన్‌ ప్రత్యేక శ్రద్ధతో ఆదాయం భారీ స్థాయిలో పెరుగుతున్నది. రాజగోపురం కుంభాభిషేకం రోజున రూ.56,786, 24వ తేదీన(ఆదివారం) రూ.7,14,823, డిసెంబర్‌ 1న రూ.6,49,616, డిసెంబర్‌ 8న రూ.16,01,381, డిసెంబర్‌ 15న రూ.9,81,094, డిసెంబర్‌ 22న రూ.12,75,157(కల్యాణోత్సవం), 29న రూ.13,35,097, జనవరి 5వ తేదీన రూ.10,96,883, జనవరి 12న రూ.13,46,781, డిసెంబర్‌ 19న పట్నం వారం రూ.31,67,671, లష్కర్‌వారం రూ.32,29,972, 3వ ఆదివారం 34,89,645, 4వ ఆదివారం రూ.22,72,450 ఆదాయం సమకూరింది. 

కాగా, గత సంవత్సరం ఇదే సమయంలో 4 ఆదివారాల్లో రూ.1,28,92,619 రాగా, ప్రస్తుతం రూ.2,12,17,364 ఆదాయం స్వామివారి ఖాజానకు సమకూరింది. అలాగే, గత యేడాది కుంభాషేకం నుంచి కల్యాణోత్సవం వరకు రూ. 33,60,359 ఆదాయం వచ్చింది. ప్రస్తుత బ్రహ్మోత్సవాల సందర్భంగా  4 ఆదివారాల్లో రూ.1,78,57,005 ఆదాయం వచ్చింది. గత సంవత్సరం నాలుగు ఆదివారాలతో పోల్చితే ప్రస్తుతం రూ.49,64,386 ఆదాయం అదనంగా వచ్చింది.


 హుండీ ఆదాయం రూ.1,82,46,491లక్షలు

స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని హుండీల లెక్కింపులు జరిపారు. గత యేడాది ఇదే సమయం లో రూ.76,18,360 రాగా, ఈ యేడాది 1,82, 46,491 నగదు వచ్చింది. ఈ యేడాది డిసెంబర్‌ 12వ తేదీన రూ. 49,86,899, జనవరి 13న రూ.58,81,980, జనవరి 30న లెక్కింపుల్లో ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రూ. 73,77,612 ఆదాయం వచ్చింది. స్వామివారి ఉత్సవాలు మరో 6 ఆదివారాలు కొనసాగనుండడంతోపాటు మరో 4 సార్లు హుండీలను  లెక్కించనుండడంతో ఆదాయం పెరిగే ఆవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.


 పెరుగుతున్న ఆలయ ఆదాయం

భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఆలయ పునరుద్ధరణ కమిటీ, ఈవో, ఏఈవో, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో ఆదాయం పెరుగుతున్నది. భక్తులు సకాలంలో స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా వెనుక గేట్‌, మహా మండపం నుంచి ఆలయానికి ప్రవేశించే మార్గాలను మూసివేయడంతో భక్తులు క్యూలైన్ల ద్వారా దర్శనాలు చేసుకుంటున్నారు. దీనికి తోడుగా అధికారులు, సిబ్బందితో పాటు చైర్మన్‌, కమిటీ సభ్యులు పలు ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తూ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సైతం గత సంవత్సరం దర్శనానికి ఇబ్బందులు పడ్డామని.. ప్రస్తుతం బాగుందని తెలుపుతున్నారు.


logo