గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Feb 11, 2020 , 23:37:59

పరీక్షల సమయం ఆందోళన వద్దు

పరీక్షల సమయం ఆందోళన వద్దు
 • చదువుతో పాటు ఆరోగ్యమూ కీలకమే..
 • సమతుల ఆహారంతోనే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి
 • యోగా, ధ్యానంతో ఒత్తిడికి ఉపశమనం
 • సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి
 • పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలని నిపుణుల సూచన

ఇంటర్‌, టెన్త్‌ తదితర విద్యార్థులకు పరీక్షల సమయం తరుముకొస్తున్నది.. చక్కటి భవిష్యత్‌కు పునాదులు వేసుకునే సమయమిది.. ఏడాదంతా చదివిన దానికి ఫలితాన్ని నిరూపించుకునే అసలైన సందర్భమిది. సాధారణ సమయంతో పోల్చితే, పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఒత్తిడి తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావం మనసుతో పాటు శరీరంపై పడుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యం కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీలక సమయంలో ఆహారంపై కాస్త శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ఇలాంటప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల సహకారం ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.


పది, ఇంటర్‌,తదితర విద్యార్థులకు వార్షిక పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాలో అంతా కలిసి సుమారు 70వేలకు పైగా మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఏడాదంతా చదివినదానికి ఫలితాన్ని నిరూపించుకునే అసలైన సందర్భమిది. చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసుకునే సమయమిదే. సమయం సమీపిస్తున్న కొద్ది మానసిక ఆందోళనకు గురవుతుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆహారం విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. ఇదే ప్రమాదానికి కారణమవుతుంది. సకాలంలో సరైన సమతులాహారం తీసుకోవడం, ధ్యానం వంటి ఏకాగ్రత సాధనలు మన కు మనం ఉత్తేజితులను చేసుకునేందుకు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. 


చదువుల ఒత్తిడితో సమయానికి తిండి తినక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అసలుకే ఇబ్బంది కలుగుతుంది. టీ, కాఫీలతో రాత్రింబవళ్లు మేల్కొని ఏకధాటిగా చదవడం, వ్యాయామానికి దూరం కావడం వంటి కారణాల వల్ల పరీక్షల సమయానికి అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల సహకారం ఉండాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 

  

ఆహార ప్రణాళిక..

పరీక్ష ఒత్తిళ్లను తట్టుకోవడానికి, జ్ఞాపకశక్తిని నిలుపుకోవడానికి, సృజనాత్మకత మందగించకుండా ఉండటానికి సమతులాహారం ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదివినదంతా గుర్తుంచుకునేందుకు సరైన ఆహార ప్రణాళిక (డైట్‌ ప్లాన్‌) పాటించాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు ఇష్టం లేని ఆహారం బలవంతంగా ఇస్తే పరీక్షల సమయంలో కళ్లు తిరగడం, కడుపు తిప్పడం వంటి సమస్యలొస్తాయి. మసాలాలు, నూనె వంటకాలు తినకూడదు. కొన్ని రకాల తినుబండారాలు తిన్నాక అరగంట వరకు వాటి ప్రభావం మెదడుపై ఉంటుంది. అందుకే తీసుకునే ఆహారం సరిగ్గా ఉందా, లేదా అనేది గమనించాలి. బయట ఆహారాన్ని  తీసుకోకపోవడమే ఉత్తమం.


యోగా సాధనతో శక్తిమంతం..

 • ప్రతి విద్యార్థిలో ఏదో శక్తి దాగి ఉంటుంది. యోగా సాధనతో అంతర్గతంగా ఉన్న శక్తులు, నైపుణ్యాలు బహిర్గతమవుతాయి. ప్రతి రోజూ అరగంట ధ్యానం, యోగాసాధనకు కేటాయిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ఆత్మైస్థెర్యం లభిస్తాయి. 
 • మౌనంగా చదవడం కన్నా కొంచెం బయటకు వినిపించేలా చదవడం మంచిది. గొంతులో స్వరపేటికలో ఉండే తంత్రులు కదిలేలా చదవడం ప్రయోజనకరం. దీన్ని మెదడు అంతర్గతంగా వింటూ ఉంటుంది.
 • చదివే సమయంలో ఎక్కువసార్లు కనురెప్పలు కదల్చాలి. ఏకాగ్రత కుదరనప్పుడు అయి దు నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. గాలి వచ్చే ప్రదేశంలో కూర్చుని చదవాలి.
 • నిత్యం శారీరక వ్యాయామం అవసరం. ఆటలాడితే మార్కులు తగ్గిపోతాయని తల్లిదండ్రు లు పిల్లలను కట్టడి చేస్తారు. ఆటల వల్ల జీర్ణక్రియ లు, రక్తప్రసరణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తాయి.


ఏకాగ్రత పెంచేలా..

 • పరీక్షల సమయంలో మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించాలి.
 • విద్యార్థులు చదువుకునేందుకు అంతరా యం లేకుండా చూడాలి. వారి ఏకాగ్రతను దెబ్బతీసే శబ్ధాలు ఉండకూడదు. పాఠ్యాంశాలన్నీ చదివేలా ప్రణాళికకు తల్లిదండ్రులు సహకరించాలి.
 • విద్యార్థులను విమర్శించడం, తిట్టడం, కొట్టడం చేయకూడదు. తల్లిదండ్రులు చూపించే ప్రేమతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరగాలి. అప్పుడే వారు మంచి ఫలితాలను సాధిస్తారు.
 • పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీ ఆలోచనలు, ఆశయాలను వారి ముందు వ్యక్తపరచాలి. వారి విజయాల్లో, ఓటముల్లో కూడా తల్లిదండ్రులు తోడుగా ఉంటారనే నమ్మకాన్ని కలిగించాలి.


సమయ పాలన కీలకం..

సమయపాలన విషయంలో ప్రతి రోజూ రాత్రి సాధ్యమైనంత వరకు 10 గంటలకే నిద్రపోయి తెల్లవారు జామున 4 గంటలకు లేవాలి. పాఠశాల, కళాశాల సమయాన్ని మినహాయింపు చేసుకోవాలి. వీటిలో తరగతిలో బోధించే వాటికి, పాత పాఠాలకు విడివిడిగా సమయ విభజన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించవచ్చు.


బృంద చర్చలు మంచిది..

విద్యార్థులు అదేపనిగా పుస్తకాల్లోని విషయాలను బట్టీపట్టే కన్నా, చదివిన పాఠ్యాంశాలపై, గత ప్రశ్న పత్రాలు తదితరవాటిపై బృంద చర్చలు నిర్వహించడం మేలు. ఇలా చేయడం వల్ల పోటీతత్వం అలవడుతుంది. తమకు తెలియని వివిధ విషయాలను స్నేహితుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలిసిన వాటిని వ్యక్తపరిచే విధానం వల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగవుతుంది. సందేహాలను గుర్తించి ఉపాధ్యాయుల ద్వారా వాటిని నివృత్తి చేసుకునేందుకు వీలు కలుగుతుంది.


మైండ్‌ మ్యాప్‌..

విద్యార్థి చదువుకునే సమయంలోనే ఒక పాఠానికి సంబంధించి ముఖ్య విషయాలను ఒకే చోటకు చేర్చడాన్ని మైండ్‌ మ్యాప్‌ అంటారు. దీనివల్ల విద్యార్థికి ఆ పాఠ్యాంశంపై అవగాహనతో పాటు పరీక్షలో ప్రశ్న ఏ రకంగా అడిగినా సులభంగా రాయగలడు. ఖాళీ సమయంలో దీన్ని చూస్తుంటే విషయం మొత్తం గుర్తుకు వస్తుంది.


ఈ సమయంలో చేయకూడనివి..

 • సెల్‌ఫోన్లతో విలువైన సమయం వృథా కావడంతో పాటు ఎక్కువగా వినియోగించడం వల్ల చదువుపై దృష్టి కేంద్రీకరించలేరు.
 • ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను యువత విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎంత లేదన్నా రోజుకు కనీసం రెండు, మూడు గంటల సమయం కేటాయిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల వీటన్నింటికీ దూరంగా ఉండడం మేలు.
 • ఖాళీ సమయంలో టీవీలకు అతుక్కుపోవడం సర్వసాధారణం. దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది. కాసేపు ఆటవిడుపుగా హాస్యం, కార్టూన్‌ లాంటివి వీక్షిస్తే మంచిది. పరీక్షలు పూర్తయ్యే వర కు వీటన్నింటికీ దూరంగా ఉండడమే ఉత్తమం.


జాగ్రత్తలు పాటిస్తేనే..

ఉదయం తీసుకునే అల్పాహారంలో మెదడుకు అదనపు శక్తినిచ్చే విటమిన్‌ ‘బి’ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ రవ్వ, రొట్టెలు, దోశ, బ్రౌన్‌ బ్రెడ్‌, ఓట్స్‌, జొన్న అటుకులు వంటి వాటిని ఎంపిక చేసుకోవాలి. మధ్యాహ్నం వేళ అన్నం, గోధుమ రొట్టెలతో పాటు ఐరన్‌, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మేలు. సాయంత్రం వేళ పండ్లతో పాటు ప్రొటీన్లు అధికంగా ఉండే పల్లీలు  వంటివి తినొచ్చు. ఇక రాత్రి పూట తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రాత్రి పది గంటల వరకు చదువుకోవాలంటున్నారు.


ఏడు గంటల నిద్ర తప్పనిసరి..

రోజుకు ఏడు గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం రోజూ 4 లీటర్లు మంచినీళ్లు తాగాలి. పరీక్షల సమయంలో మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు చూపించే ప్రేమతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరుగాలి.


పౌష్ఠికాహారం ఇవ్వాలి..

పరీక్షల సమయంలో విద్యార్థులకు పండ్లు, పండ్ల రసాల వంటి ఆహారం ఇవ్వాలి. ఇతర పనులు చెప్పి వారి విలువైన సమయాన్ని వృథా చేయకూడదు. టీ, కాఫీలు తాగడం మానేసి పాలు, రాగి గంజి తాగితే శక్తితో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సరైన ఆహారం తీసుకోకపోతే రక్తహీనత పెరుగుతుంది. హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం వల్ల మెదడుకు సరిపోయేంత ఆక్సిజన్‌ అందదు.

- డా.పెంటాచారి, వైద్యుడు, గజ్వేల్‌


నిరుత్సాహపరచకూడదు

పిల్లల చదువు విషయంలో ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలి. ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. వారిలో పాజిటివ్‌ దృక్పథం అలవడేలా చూడాలి. ఈ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు యోగ, ధ్యానం చేయడం సరైనది. దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా ఉంటుంది.

-శ్రీనివాసాచారి, మానసికశాస్త్ర  ఉపన్యాసకుడు 

తాజావార్తలు


logo