గురువారం 04 జూన్ 2020
Siddipet - Feb 11, 2020 , 23:35:47

సహకార ప్రచారం షురూ..

సహకార ప్రచారం షురూ..

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట. ఎన్నికలేవైన గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదే. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో ప్రతి ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగిస్తున్నది. శాసన సభ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఇలా వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నది. ఈ నెల 15న జరగనున్న సహకార ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ తన హవాను కొనసాగించనున్నది. ఇప్పటికే జిల్లాలో 13 సొసైటీల్లో చైర్మన్‌ స్థానానికి కావాల్సిన సంఖ్యాబలాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 21 సొసైటీలను గెలుచుకొని మరోమారు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటేందుకు గులాబీ సైనికులు పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌, ములుగు, కొండపాక, వర్గల్‌ సొసైటీల్లో మెజార్టీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు, పాలమాకుల, అల్లీపూర్‌, గంగాపూర్‌, సిద్దిపేట సొసైటీల్లో మెజార్టీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని తన సత్తాను చాటుకున్నది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్‌, కాన్గల్‌ సొసైటీల్లో మెజార్టీ స్థానాల్లో డైరెక్టర్లను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. 


హుస్నాబాద్‌ శాసన సభ్యుడు వొడితెల సతీష్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కట్కూర్‌ సొసైటీని ఏకగ్రీవంగా గెలుచుకోగా.. కోహెడలో సొసైటీ స్థానానికి కావాల్సిన డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసన సభ్యుడు రసమయి బాలకిషన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి సొసైటీలో 7 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని రేబర్తి సొసైటీలో 3, చేర్యాల సొసైటీలో 3 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 20 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని వార్డులు గెలుచుకునేలా వ్యూహరచన చేశారు. మొత్తంగా జిల్లాలో 21 సొసైటీలో గులాబీ జెండా ఎగురవేసే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. సహకార ఎన్నికల్లో  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం పాకులాడుతున్నారు. జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. 


logo