గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 09, 2020 , 23:33:40

అపురూప క్షణాలు..

 అపురూప క్షణాలు..
  • ఏడు తరాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  • మల్టీపర్పస్‌ హైస్కూల్‌కు ఘన చరిత్ర ఉంది
  • ఈ బడి గొప్ప సామాజిక మార్పు తెచ్చింది
  • బడి అంటే.. ఊరి ప్రజల ఉమ్మడి ఆస్తి
  • ప్లాటినం జూబ్లీ వేడుకల్లో... ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/ సిద్దిపేట టౌన్‌ : మల్టీపర్పస్‌ హైస్కూల్‌కు ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాక ముందే  పాఠశాల ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీతోపాటు అనేక మంది విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలను సమాజానికి అందించింది. మల్టీపర్పస్‌ హైస్కూల్‌ సిద్దిపేట ప్రాంతంలో గొప్ప సామాజిక మార్పు తీసుకవచ్చింది. ఇలాంటి బడిలో నేడు ఏడు తరాల విద్యార్థులతో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడం అపురూప ఘట్టమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. 


ఆదివారం సిద్దిపేటలో మల్టీపర్పస్‌ హైస్కూల్‌ ఏర్పడి 75 సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, పూర్వ విద్యార్థి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాంతో కలిసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్‌, కాపు రాజయ్య చిత్రాల ప్రదర్శనను తిలకించారు. 


 ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మల్టీపర్పస్‌ హైస్కూల్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో సిద్దిపేట ప్రాంతం సమాజానికి అనేక మంది విద్యావేత్తలను అందించిందన్నారు. పూర్వ విద్యార్థులు పాఠశాల కోసం కొంత సహాయా న్ని అందించి ఇప్పుడున్న విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనిసూచించారు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కావాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలని, అది విద్యావంతులు ఉన్నచోటే సాధ్యమని పేర్కొన్నారు. పాఠశాల మనకెన్నో ఇచ్చిందని.. ఉద్యోగాలను కల్పించిందని.. బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద విద్యార్థులు చదువుతున్నారని, వారిని ఉన్న త పౌరులుగా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థులు సహకరించా లని కోరారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. 


1969లో తొలిదశపాటు 2001మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ తొలి ఎమ్మెల్యేలను అందించిన గడ్డ సిద్దిపేట అని గుర్తు చేశారు. తెలంగాణను సాధించిన ఘనత కూడా సిద్దిపేట బిడ్డ సీఎం కేసీఆర్‌కే దక్కిందని.. ఇది మనందరికీ గర్వకారణమని మంత్రి అన్నా రు. పేద, ధనిక, కుల, మత వర్గ బేధం లేకుండా అందరూ కలిసుండేది ఒక బడిలోనే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్‌ బోర్డులు కనిపించేలా పాఠశాలలను తీర్చిదిద్దినప్పుడే మార్పు సాధ్యమని చెప్పారు. శతశాతం ఫలితాలను ప్ర భుత్వ పాఠశాలల్లో సాధించాలన్నారు. సీఎం కేసీఆర్‌ బీసీ, ఎస్సీ, మైనార్టీల కోసం పెద్ద ఎత్తున పాఠశాలలు నెలకొల్పుతున్నారన్నారు. మల్టీపర్పస్‌ హైస్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకారిస్తానని హామీ ఇచ్చారు. ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.. పాఠశాల అభివృద్ధికి  నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం అధ్యాపకులు, పూర్వ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. 


 కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భగవంతయ్య, ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌, లక్ష్మయ్య, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, నా యకులు వర్మ, యాదగిరిరావు, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, గ్యాదరి రవీందర్‌, ప్రభాకర్‌, ఉమారాణి శ్రీనివాస్‌, చందు, కోమాండ్ల రామచంద్రారెడ్డి, కోమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌లాల్‌, కలాల్‌ శ్రీనివాస్‌, బోనాల నర్సింలు, పెసర రాజు ఉన్నారు. 


పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం 

పూర్వ విద్యార్థి కిరణ్‌.. పాఠశాల అభివృద్ధికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. వినోద్‌మోదానీ.. మంత్రి జన్మదినం రోజు విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు ఇస్తానని ప్రకటించారు.  మార్క సతీశ్‌.. పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేస్తానన్నారు. అలాగే, 1993 -94 బ్యాచ్‌ విద్యార్థులు.. బ్యాట్మింటన్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌ జ్ఞాపకార్థం.. ప్రతి యేడాది క్రీడాకారులకు ప్రతి యేటా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు.

తాజావార్తలు


logo