సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 08, 2020 , 00:59:20

అక్కన్నపేటలో కాల్పుల కలకలం

అక్కన్నపేటలో కాల్పుల కలకలం
  • ప్రత్యర్థిపై ఏకే-47తో కాల్పులు జరిపిన సదానందం
  • త్రుటిలో తప్పించుకున్న గంగరాజు కుటుంబసభ్యులు
  • ప్రహరీ ఇటుకల విషయంలో ఘర్షణ
  • కాల్పుల అనంతరం నిందితుడు పరారీ
  • తుపాకీ ఎలా వచ్చింది అన్నదానిపై ముమ్మర విచారణ
  • నాలుగేండ్ల క్రితం అప్పటి సీఐ గన్‌మన్‌ వద్ద తుపాకీ అదృశ్యం
  • అది ఇది ఒకటేనా..? సదానందం మాజీ మిలిటెంటా..?
  • అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
  • 15 ఏండ్ల తర్వాత తుపాకీ శబ్దంతో జనం ఉలికిపాటు

పోలీసుల అదుపులో నిందితుడు సదానందం ?  

అక్కన్నపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది..అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గ్రామం తుపాకీ శబ్దంతో జనం పరుగులు తీశారు..భారీ శబ్దం ఎక్కడ్నుంచి వచ్చిందని తెలుసుకునేలోపే నిందితుడు ప్రత్యర్థిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. అక్కన్నపేటకు చెందిన గంగరాజు, సదానందం ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. ఇంటి ప్రహరీ ఇటుకల విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా..సదానందం దాడి చేసేందుకు యత్నించాడు. గురువారం మళ్లీ గొడవ జరగడంతో కక్ష పెంచుకున్న సదానందం, గంగరాజు కుటుంబాన్ని అంతం చేయాలని భావించి రాత్రి 10 గంటల సమయంలో ఏకే-47 తుపాకీతో కాల్పులు జరపగా, ఎవరికీ ప్రాణనష్టం సంభవించలేదు. ఇంటి వద్ద తుపాకీ బులెట్‌ షెల్‌తోపాటు గంగరాజుపై కాల్పులు జరిపిన బులెట్‌ షెల్‌ను, సదానందం పారిపోతుండగా పడిపోయిన పేలని బులెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సోదాల్లో తల్వార్‌, ఏకే-47 అమర్చే బెల్టు దొరికాయి. కాల్పుల ఘటనతో అక్కన్నపేట వాసులు వణికిపోతున్నారు. దాదాపు పదిహేనేండ్ల తర్వాత నియోజకవర్గంలో తుపాకీ శబ్దం మోగడంతో కలవరానికి గురవుతున్నారు. మేకలు కాస్తూ, కూలీ పనిచేసుకునే సదానందానికి తుపాకీ ఎలా వచ్చింది ? తుపాకీ పేల్చడం ఇతడికి ఎలా వచ్చు ? గతంలో మిలిటెంట్‌గా పనిచేశాడా ? నాలుగేండ్ల క్రితం అపహరణకు గురైన హుస్నాబాద్‌ సీఐ దాసరి భూమయ్య గన్‌మన్‌ తుపాకీ ఇదేనా? అన్న కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నిందితుడిని కోహెడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. 

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం తుపాకీ శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నడూ లేని విధంగా ఇంతపెద్ద శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే లోపే నిందితుడు తన ప్రత్యర్థిపై కాల్పులు జరిపి పారిపోయిన ఉదంతం చోటు చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి జరిగిన విషయం తెలుసుకొని నివ్వెరపోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కాల్పులు జరిగిన కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ ఇంటిలోనే ఉండగా, గ్రామస్తులు నచ్చజెప్పడంతో ప్రాణాలు చేతపట్టుకొని బయటకు వచ్చి జరిగిన విజయం చెప్పారు. అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి ఏకే-47 తుపాకీతో జరిగిన కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ప్రహరీ ఇటుకల కోసం వచ్చిన గొడవను దృష్టిలోఉంచుకొని, అక్కన్నపేటకు చెందిన గుంటి గంగరాజు కుటుంబంపై కక్షగట్టిన ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న దేవుని సదానందం అనే వ్యక్తి తన వద్ద ఉన్న ఏకే-47తుపాకీతో ఇంట్లో ఉన్న గంగరాజు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపాడు. సుమారు రాత్రి 10గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనలో బుల్లెట్‌ ఎవరికీ తగలలేదు. ఏసీపీ మహేందర్‌ ఘటనా స్థలానికి చేరుకొని, దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


సిమెంటు ఇటుకల విషయంలో..

సదానందం, గంగరాజుల ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. ప్రహరీ ఇటుకల విషయంలో బుధవారం గంగరాజుతో పాటు ఆయన తల్లి ఎల్లవ్వతో గొడవపడిన సదానందం, సాయంత్రం తన వద్ద ఉన్న తల్వార్‌తో దాడికి యత్నించగా చుట్టుపక్కల వాళ్లు అడ్డుకున్నారు. గురువారం సాయంత్రం కూడా మళ్లీ గొడవ జరగడంతో కుటుంబం మొత్తం కాల్చిపడేస్తానని సదానందం బెదిరించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఏకే 47 తుపాకీని కిందికి కాల్చి, పరీక్షించుకున్న సదానందం తుపాకీ పట్టుకొని గంగరాజు ఇంటివైపు వస్తుండగా, గమనించిన చుట్టుపక్కల వాళ్లు గంగరాజుకు విషయం చెప్పడంతో కుటుం సభ్యులు అందరూ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కిటికీలోంచి చూసి గంగరాజుపై తుపాకీ గురిపెట్టి కాల్చగా, అది గోడకు తగిలి, అక్కడి నుంచి మరో గదిలోని గోడకు తగిలి కిందపడింది. గంగరాజు చనిపోయాడనుకుని సదానందం తుపాకీతో పాటు అక్కడి నుంచి పారిపోయాడు. సదానందం ఇంటి వద్ద తుపాకీ బులెట్‌ షెల్‌తో పాటు గంగరాజుపై కాల్పులు జరిపిన బులెట్‌ షెల్‌ను, సదానందం పారిపోతుండగా పడిపోయిన పేలని బులెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదానందం ఇంటిలో సోదాలు జరపగా పెద్ద తల్వార్‌, ఏకే-47కు ఉండే బెల్టు దొరికాయి.

గతంలోనూ పలువురికి బెదిరింపులు

కాల్పుల సంఘటనలో నిందితుడు సదానందం గ్రామంలోని పలువురితో పలుమార్లు గొడవలు పడి బెదిరింపులకు గురిచేసే వాడని, సైకోలాగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు తెలిపారు. తన రెండో భార్య విషయంలో గొట్టె కనుకయ్య అనే వ్యక్తితో గొడవపడగా కనుకయ్య ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే కనుకయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌ చేయికి తీవ్రగాయాలైనా ఆ విషయం బయటకు పొక్కలేదు. తన సొంత గ్రామమైన కోహెడలోనూ తన బంధువులను బెదిరింపులకకు గురిచేసేవాడు. కోహెడ మండల కేంద్రానికి చెందిన దేవుని కనుకయ్య-మల్లవ్వ దంపతులకు ఏకైక కుమారుడు సదానందం. కనుకయ్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అప్పటి వరకు తండ్రితో మేకలు, గొర్రెలు కాసేందుకు వెళ్లే సదానందం సుమారు 2000 సంవత్సరంలో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. భర్త గొడవ భరించలేక సదానందం తల్లి తన తల్లిగారి ఊరైన అక్కన్నపేటకు వచ్చి తన సోదరుడు గుంటి వెంకటయ్య వద్ద ఉంటోంది. పదేండ్ల తర్వాత 2010ప్రాంతంలో సదానందం అక్కన్నపేటలో ఉంటున్న తన తల్లివద్దకు వచ్చాడు. అప్పటి నుంచి మేనమామకు ఉన్న మేకలు కాస్తూ జీవిస్తుండగా నర్మెట్ట మండలం రామరాజుపల్లికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక సదానందం వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి పోయింది. అనంతరం నంగునూరు మండలం ఖాత గ్రామానికి చెందిన కృష్ణవేణితో వివాహం జరిపించారు. కుమారుడు, కూతురు ఉన్నారు.

ఏకే-47 ఎక్కడి నుంచి వచ్చింది?

మేకలు కాస్తూ, కూలీ నాలీ చేస్తూ జీవనం సాగించే సదానందం వద్ద ఏకే 47 తుపాకీ ఎలా వచ్చింది? తుపాకీ పేల్చడం ఇతనికి ఎలా వచ్చు? ఎన్ని రోజుల నుంచి తుపాకీ అతని వద్ద ఉంటోంది? కొన్నాళ్లు మిలిటెంట్‌గా పనిచేశాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో జోరుగా చర్చజరుగుతోంది. 2016లో హుస్నాబాద్‌ ఠాణాలో సీఐ దాసరి భూమయ్య గన్‌మెన్‌ చేతిలో ఉండే ఏకే-47 గన్‌ అదృశ్యమైన సంఘటన సంచలనం సృష్టించింది. సీఐ దాసరి భూమయ్యపై అప్పటి ఎస్పీ శివకుమార్‌ శాఖపర చర్యలు తీసుకున్నా, ఆయుధం కనపడకుండా పోయింది. ఇప్పటికీ ఆ ఘటనపై విచారణ జరుగుతోంది. అయితే కాల్పుల నిందితుడు అప్పట్లో సదానందం తన తల్లిదండ్రుల పంచాయతీ విషయమై నిత్యం హుస్నాబాద్‌లోని సీఐ కార్యాలయానికి వస్తుండే వాడని, ఆ క్రమంలోనే ఏకే 47 గన్‌ను దొంగిలించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి ఇంటి వద్ద దొరికిన ఏకే 47 తుపాకీకి బెల్టుపై ఏపీ పోలీస్‌ అని ఉందని స్థానికులు చెప్పడం చర్చనీయాంశమైంది. అలాగే పదేండ్ల పాటు కనిపించకుండా పోయిన సదానందం పీపుల్స్‌వార్‌లో మిలిటెంట్‌గా పనిచేశాడా...? అజ్ఞాతవాసంలో ఉండి బయటకు వచ్చేటప్పుడు ఈ ఆయుధాన్ని వెంట తెచ్చుకున్నాడా...? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే అతనికి ఏకే 47 గన్‌ పేల్చే విధానం తెలిసిందనేది మరో వాదన.

15ఏండ్ల అనంతరం తుపాకీ శబ్దం

ఒకప్పుడు హుస్నాబాద్‌ ప్రాంతం అంటేనే పీపుల్స్‌వార్‌ ఉద్యమాలకు పురిటిగడ్డలా ఉండేది. రాష్ట్రంలో పీపుల్స్‌వార్‌ ఉద్యమం చురుగ్గా సాగిన ప్రాంతం ఇది. అమరవీరుల కోసం ఆసియాలనే రెండో ఎత్తయిన స్మారక స్తూపాన్ని నిర్మించి దానిని ఆవిష్కరించేందుకు అధికారులను కిడ్నాప్‌ చేసిన సంఘటనలు, ఎన్నో ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, నిత్యం గాలింపులు జరిగిన ప్రాంతం ఇది. 2001లో అమరవీరుల స్తూపం కూల్చివేత, 2004-05ప్రాంతంలో జరిగిన బంక సమ్మయ్య ఎన్‌కౌంటర్‌ తర్వాత ఇక్కడ తుపాకీ శబ్దం గానీ, పీపుల్స్‌వార్‌ కదలికలు గానీ కనిపించలేదు. సుమారు 15ఏండ్ల తర్వాత అక్కన్నపేటలో తుపాకీ శబ్దం వినపడటంతో ప్రజలంతా పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ : ఇన్‌చార్జి సీపీ

ఏకే 47 తుపాకీతో కాల్పుల సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని ఇన్‌చార్జి సీపీ ఎన్‌ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. సిమెంటు ఇటుకల విషయంలో రెండు కుటుంబాలకు జరిగిన గొడవలో దేవుని సదానందం అనే వ్యక్తి గుంట గంగరాజు ఇంటికి వెళ్లి కాల్పులు జరిపారడని, ఈ ఘనటలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారని, అందుకనుగుణంగా దుండగుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీల ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే సంఘటనకు సంబంధించి, ఆయుధంకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని సీపీ అన్నారు. 

పోలీసుల అదుపులో నిందితుడు?

కాల్పులకు పాల్పడ్డ నిందితుడు దేవుని సదానందం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి ఏడున్నరగంటల ప్రాంతంలో కోహెడ మండల కేంద్రంలోని బాదుగుల చెరువు వద్ద ఓ వ్యక్తి మద్యం తాగుతూ, ఒంటరిగా ఉన్నాడనే సమాచారంతో హుస్నాబాద్‌ ఎస్‌ఐ దాస సుధాకర్‌ వెళ్లి చూసి సదానందంగా గుర్తించారని, ఆయుధంతో సహా సదానందం దొరకడంతో వెంటనే కోహెడ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. భద్రత దృష్ట్యా అక్కడి నుంచి హుస్నాబాద్‌ ఠాణా కు ఆయుధంతో సహా తీసుకొచ్చి అక్కడి నుంచి సిద్దిపేట పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారని విశ్వసనీయ సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

24గంటల్లోపే..

కాల్పుల సంఘటనపై ఏసీపీలు మహేందర్‌, బాలాజీ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు, 24 గంటల్లోపే కొలిక్కి తెచ్చారు. క్లూస్‌టీం, ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగి, చుట్టు పక్కల గ్రామాలను జల్లెడ పట్టి, తుపాకీతో సహా పారిపోయిన సదానందాన్ని కోహెడ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించినట్లు తెలుస్తున్నది. కాగా, పోలీసులు ఏకే-47తో పాటు మిషన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


logo