శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 08, 2020 , 00:54:37

వనదేవతలకు వందనం

వనదేవతలకు వందనం
  • సమ్మక్క-సారలమ్మకు బంగారం మొక్కులు
  • జనసంద్రంగా మారిన జాతరలు
  • పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు

హుస్నాబాద్‌ టౌన్‌ : జిల్లాలో సాగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం సమర్పించి, కోళ్లు, మేకలను కోసి, ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ వేడుకున్నారు. హుస్నాబాద్‌ పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుంచి భక్తజనం తరలిరావడంతో ఎల్లమ్మచెరువు ప్రాం తం జనసందోహంగా మారింది. వందలాదిమంది జనం ఎల్లమ్మచెరువు వద్ద విడిది చేసి అక్కడే వంటలు చేసుకుని తల్లిబిడ్డలకు నిలువెత్తు బంగారం, వొడిబియ్యంతోపాటు ఎదురుకోళ్లను సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చిన తల్లులకుగాను అనేకమంది తల నీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. పెద్దసంఖ్యంలో జనం తరలిరావడంతో భక్తులు తోసుకురాకుండా దర్శనానికి ఆలయానికి చెందిన నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 


మున్సిపల్‌చైర్‌పర్సన్‌ దంపతుల పూజలు

హుస్నాబాద్‌ పట్టణంలోని సమ్మక్క-సారలమ్మను మున్సిపల్‌చైర్‌పర్సన్‌ ఆకుల రజిత వెంకన్న దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌చైర్‌పర్సన్‌ దంపతులను ఆలయకమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

వెల్లువలా వనదేవతల వద్దకు..

కోహెడ: మండలంలోని పరివేద, వింజపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతరలు ఘనంగా జరుగుతున్నాయి. సారలక్క సమ్మక్కలు గద్దెలకు చేరుకోవడంతో శుక్రవారం భక్తులు వన దేవతల దర్శనానికి వెల్లువలా తరలివచ్చారు. దీంతో జాతరల స్థలాలు భక్తులతో పోటెత్తాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మలకు మొక్కులు సమర్పించుకున్నారు. నిలువెత్తు బంగారాలు ఇచ్చి అమ్మవార్ల దీవెనలు పొందారు. అనంతరం చెట్లకింద వంటలు చేసుకొని సేదతీరారు. ఏఎంసీ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, వైస్‌ఎంపీపీ తడకల రాజిరెడ్డి, సామాజిక కార్యకర్త పిడిశెట్టిరాజు, దళిత విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల కిరణ్‌కుమార్‌ అమ్మలను దర్శించుకున్నారు. జాతర కమిటీల సభ్యులు నర్సింహారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, కృష్ణమూర్తి, రాజేశ్వర్‌రావు, పాము రాములు, పాము సత్తయ్య, నారాయణ, బండమీది రాజమౌళి తదితరులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు.


వనదేవతలకు మొక్కులు

కొమురవెల్లి : కొమురవెల్లి పాత కామన్‌ వద్ద కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకోవడంతో పాటు అమ్మవార్లకు ప్రీతి దాయకమైన(బెల్లం) బంగారం సమర్పించి మొక్కులు చెలించుకున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మను, గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చిన నిర్వాహకులు, శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇద్దరు అమ్మవార్లు గద్దెనెక్కడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన మంకాల నాగేశ్‌గుప్తా అన్నదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

కూటిగల్‌లో..

మద్దూరు : మండలంలోని కూటిగల్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర 3వ రోజుకు చేరుకుంది. శుక్రవారం గద్దెలపై ఉన్న సమ్మక్క-సారలమ్మను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు

బెజ్జంకిలో వైభవంగా..

బెజ్జంకి: మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వడ్లూ ర్‌, గుండారం గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగుతున్నాయి. తల్లులు గద్దెలకు రాగా భక్తులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఎత్తు బంగారం, ఎదురుకోళ్లు, ఒడిబియ్యం, బెల్లం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. తోటపల్లిలో మంత్రి హరీశ్‌రావు తల్లిదండ్రులు సత్యనారయణరావు-లక్ష్మీ దర్శించుకోగా, వడ్లూర్‌లో రాష్ట్ర నాయకుడు తన్నీరు శరత్‌రావు దంపతులు, ఎంపీపీ, జడ్పీటీసీలు దర్శించుకోని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


logo