శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Feb 07, 2020 , T00:30

స్వాతంత్య్రానికి ముందు ఆవిర్భవించిన మల్టీపర్పస్ బడి

స్వాతంత్య్రానికి ముందు ఆవిర్భవించిన మల్టీపర్పస్  బడి

 సిద్దిపేట టౌన్: సిద్దిపేట మల్టీపర్పస్ పాఠశాల అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం కాలంలో స్థాపించిన పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి 75 వసంతాలకు అడుగీడినది. సుమారు 35 వేలకు పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించినది. చదువులమ్మ ఒడిలో అక్షరాలు దిద్దిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో తమదైన ముద్రను వేసి పాఠశాల ఖ్యాతిని చాటుతున్నారు. మనమెంత ఎత్తుకు ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు ఉల్లాసంగా మారుతుంది. పాఠశాల రోజులు గుర్తుకు వస్తే మన మదిని తట్టి లేపుతున్నది. అందులో సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో చదివిన వారు ఇందుకు భిన్నంగా రెండింతల సంతోషం కలుగుతున్నది. స్వాతంత్య్రం పూర్వం స్థాపించిన పాఠశాలలో చదివామనే సంబు రం కట్టలు తెంచుకుంటున్నది. ఆ పాఠశాలలో చదివిన వారందరూ అదృష్టంగా భావిస్తారు. అలాంటి సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాల వసంతోత్సవాలు జరుపుకోనుండడంతో పూర్వ విద్యార్థులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ మధుర స్మృతులను నెమరేసుకునే సమయం ఆసన్నమైనది. అందుకు పాఠశాలలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు వేదిక కానున్నాయి. ఈ నెల 8,9 తేదీల్లో ఈ వేడుకలు అంబరాన్నంటేలా జరుపనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రస్థానం, వికసించిన విద్యా కుసుమాలు, పాఠశాల అభివృద్ధికి చేస్తున్న ప్రత్యేక కృషి తదితర అంశాలతో కూడిన ప్రత్యేక కథనం... 

 పాఠశాల ప్రస్థానం 

సిద్దిపేట ప్రజలు చైతన్యానికి వారధులుగా మొదటి నుంచి విరాజిల్లుతున్నారు. విద్యా వికాసం, వ్యాపారం ఎందులోనైనా తమదైన ముద్రతో దూసుకెళుతున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే సిద్దిపేట విద్యా కేంద్రంగా ఖ్యాతిని గడిచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, సిద్దిపేటలోనే నిజాంలు రెండు ప్రభుత్వ పాఠశాలలను స్థాపించారు. 1938 సంవత్సరంలో ఉర్దూ మీడియంతో సిద్దిపేటలో పాఠశాల ప్రారంభమైనది. తదనంతరం 1945 సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయింది. పాఠశాలను నడిబొడ్డున ఆనాడే అన్ని హంగులతో నిర్మించారు. 8,9,10 తరగతుల్లో ఉర్దూ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని ఆ కాలంలోనే ప్రారంభించారు. అదే సంవత్సరంలో కర్ణాటక రాష్ర్టానికి చెందిన సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దారు. 1949-50 సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష రాసేందుకు హైదరాబాద్ సిటీ కళాశాలకు వెళ్లారు. 1959న హెచ్‌ఎస్‌సీ హైయ్యర్ సెకండరీ స్కూల్‌గా మల్టీపర్పస్ మారింది. 1965 నుంచి 1970 వరకు మల్టీపర్పస్‌గా మారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంగా కొనసాగింది. 1971 నుంచి 10వ తరగతిగా కొనసాగింది. 2008 నుంచి 2014 వరకు తెలుగు, ఉర్దూ మీడియంగా కొనసాగింది. అదే సంవత్సరంలో నాసర్‌పుర పాఠశాలకు ఉర్దూ మీడియం బోధనను తరలించారు. 2007లో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని మల్టీపర్పస్ పాఠశాలలో ప్రవేశపెట్టింది. 2016 లో డిజిటల్ తరగతులు సైతం పాఠశాలలో ప్రారంభించింది. మొదటి నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలో బోధన జరిగింది. బోధనకు 25 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం 430 మంది విద్యార్థులు పాఠశాలలో అభ్యసిస్తున్నారు. 2020లో 75 వసంతంలోకి పాఠశాలకు అడుగిడుతుంది. ఈ సందర్భంగా పాఠశాలలో ప్లాటినమ్ జుబ్లీ వేడుకలను ఘనంగా జరుపనున్నారు. 

 విద్యా కుసుమాలను, ప్రముఖులను అందించిన బడి.. 

సిద్దిపేట మల్టీపర్పస్ పాఠశాల నిజాం కాలంలో నిర్మించారు. సుమారు 50 కి.మీ దూరం నుంచి ఈ పాఠశాలకు చదువుకునేందుకు వచ్చే వారు. ఎంతో మంది విద్యా కుసుమాలను, ప్రముఖులను ఈ పాఠశాల సమాజానికి అందించింది. పాఠశాలలో చదివిన వారందరూ దేశ విదేశాల్లో ఖండంతరాల్లో తమదైన రంగంలో రాణిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు సమాజ సేవలోను ఉన్నారు. భావి భారత పౌరులను సైతం పాఠశాల అందించింది. 1945 ప్రస్థానం నుంచి 2020 వరకు ఎంతో ఘణపాటిలను అందించి చరిత్ర మల్టీపర్పస్‌ది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, దివంగత మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, మొట్ట మొదటి  ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి, పీవీ రాజేశ్వర్‌రావుతో ప్రముఖ శాస్త్రవేత్త వీరబత్తిని సురేందర్, శ్రీనివాస్‌లు, అంతర్జాతీయ కళాకారుడు కాపు రాజయ్య, బాతిక్ చిత్రకారుడు యాసాల బాలయ్య ఇలా ఎంతో మంది ప్రముఖులు సైతం మొదట ఈ పాఠశాలలో అభ్యసించారు. 

 వేడుకలకు ప్రముఖులు 

సిద్దిపేట మల్టీపర్పస్ పాఠశాల ప్లాటినమ్ జుబ్లీ వేడుకలు ఈ నెల 8,9 తేదీల్లో జరుగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్ హాజరవుతున్నారు. వేడుకల్లో సావనీర్ ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపనున్నారు. అదే విధంగా 3 వేల మంది పూర్వ విద్యార్థులు వసంతోత్సవాల్లో పాల్గొంటారు. 

 మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరువ 

మల్టీపర్పస్ పాఠశాల అభివృద్ధిలో మంత్రి హరీశ్‌రావు తనదైన ముద్ర వేశారు. విద్యార్థుల ఇబ్బందులు తొలిగించేందుకు కృషి చేశారు. విద్యావ్యాప్తికి నిరంతరం పాటుపడ్డారు. 2009లో రేకుల షెడ్డులో కొనసాగిన తరగతి గదులను అత్యాధునిక హంగులతో 20 గదులను నిర్మించారు. రూ.20 లక్షలతో మూత్రశాలలను పాఠశాల వెనుకాల ఏర్పాటు చేశారు. మరో రూ.5 లక్షలతో వంట గది నిర్మించారు. దాత నాగరాజు ఆర్థిక సహకారంతో పాఠశాలలో గ్రంథాలయ భవనం నిర్మించి విద్యార్థుల వికాసానికి తోడ్పాటు అందించారు. 


logo