ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 07, 2020 , T00:25

మొదటి రోజు 14 నామినేషన్లు దాఖలు

మొదటి రోజు 14 నామినేషన్లు దాఖలు

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు గురువారం 10 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి చెప్యాల శ్రీనివాస్‌గౌడ్, సీఈవో క్యాతం సతీశ్ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 13వార్డులకు గాను నాలుగు వార్డులకు మాత్రమే నామినేషన్లు వచ్చినట్లు వారు చెప్పారు. ఇందులో 1వ వార్డు నుంచి 4నామినేషన్లు రాగా, రెండో వార్డు నుంచి 1, నాలుగో వార్డు నుంచి 1, 11వ వార్డు నుంచి 4నామినేషన్లు వచ్చాయన్నారు. 1వ వార్డు నుంచి గుర్రాల హన్మిరెడ్డి, పచ్చిమట్ల రవీందర్(రెండు సెట్లు), గుర్రాల లింగారెడ్డి నామినేషన్ వేయగా రెండో వార్డులో బొలిశెట్టి శివయ్య, నాలుగో వార్డులో లావుడ్య హరిలాల్, 11వ వార్డులో గుగులోతు రంగా, మంద సత్యనారాయణరెడ్డి, ఇసంపల్లి మల్లయ్య, రేండ్ల మల్లయ్య నామినేషన్ వేసినట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు శనివారం చివరి గడువు ఉన్నందున శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. 

-ఏకగ్రీవం దిశగా కట్కూర్..

అక్కన్నపేట మండలం కట్కూరు సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఈ సంఘం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఘం పరిధిలో కట్కూరు, చాపగానితండా, దుబ్బతండాలు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తం 423 మంది ఓటర్లు ఉన్నారు. 13 వార్డులుగా ఉన్న ఈ సంఘంలో ఒక్కో వార్డులో 33మంది, చివరి వార్డు అయిన 13వ వార్డులో 27మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. మూడు గ్రామాల రైతులు ఈ సంఘానికి ఎన్నికలు నిర్వహించడం కంటే ఏకగ్రీవం చేసుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అదే గనుక జరిగితే జిల్లాలో ఏకగ్రీవమైన మొదటి సంఘంగా గుర్తింపు పొందుతుందని చెప్పొచ్చు.

సహకార ఎన్నికలకు 3 నామినేషన్లు

బెజ్జంకి : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలవర్గ  సభ్యుల ఎన్నిక కోసం గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. గుండారం 11 వార్డుకు ఎలుకంటి తిరుపతిరెడ్డి, పుల్ల పోచయ్య, బెజ్జంకి 1వ వార్డుకు కొండ్ల వెంకటేశం నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సీఈవో వాసు తదితరులున్నారు.

కోహెడ పీఏసీఎస్‌లో ఒక నామినేషన్ దాఖలు

కోహెడ : సహకార సంఘ ఎన్నికలకు గురువారం నామినేషన్లు మొదలు కాగా రెండో వార్డు నుంచి వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు నామినేషన్ వేశాడు. ఎన్నికల అధికారి జి. చంద్రమౌళి నామినేషన్ తీసుకున్నారు. ఇందులో సీఈవో మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.


logo