మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 06, 2020 , 00:14:11

సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయండి

సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయండి

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని చింతమడకతో పాటు మధిర గ్రామాలైన సీతారాంపల్లి, మాచాపూర్‌, అంకంపేట, దమ్మచెరువు గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అభివృద్ధి ఫలాలను నేడు లబ్ధిదారులకు అందజేయడం నా అదృష్టమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సీఎం కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లిలకు చెందిన లబ్ధిదారులకు జేసీబీలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, గూడ్స్‌ ఆటోలు, మినీ బస్సులతో పాటు చెక్కులను ఇన్‌చార్జి కలెక్టర్‌ జేసీ పద్మాకర్‌తో కలిసి అందజేశారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చింతమడక, మధిర గ్రామాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆనందంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్‌  ఇచ్చినటువంటి ఫలాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నప్పుడే మనం సీఎం కేసీఆర్‌కు గిఫ్టు ఇచ్చిన వారమవుతామన్నారు. డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు ఓనర్లు కావడం సంతోషకరమన్నారు. ఈ రోజు నాకండ్లలో కాంతి నిండిందన్నారు. ఇచ్చిన వాహనాలను భద్రంగా నడిపి మంచిగా చూసుకోవాలన్నారు. 


ఇండ్ల నిర్మాణాలు త్వరలోనే ప్రారంభిస్తామని, ప్రజలు అధికారులకు సహకరించి ఇండ్లు ఖాళీ చేస్తే వానకాలం నాటికి నిర్మించి ఇస్తామన్నారు. నాలుగైదు రోజుల్లో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, సొంతంగా కట్టుకునే వారికి మూడు దశల్లో డబ్బులు అందజేస్తామన్నారు. లైసెన్స్‌లు లేని వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని, ఆర్టీఏ అధికారులు వాహనాలను త్వరగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలన్నారు. గ్రామంలో త్వరలోనే పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ ఫలాలు అందుతాయని, ఎవరూ అధైర్యపడవద్దన్నారు. రూ.2 కోట్ల 50 లక్షలతో గ్రామంలో శివాలయాన్ని నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బాల్‌కిషన్‌రావు, ఎంపీటీసీ జ్యోతి దేవేందర్‌, మాచాపూర్‌ సర్పంచ్‌ భాగ్యలక్ష్మి , వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 


లబ్ధిదారులకు 133 వాహనాలు అందజేత 

చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 133 వాహనాలు, భూములు కొనుగోలు చేసిన వారికి చెక్కులు, 58 మంది పౌల్ట్రీ లబ్ధిదారులకు చెక్కులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. వాహనాల్లో 23 కార్లు, 31 ట్రాక్టర్లు, 22 జేసీబీలు, 32 హార్వెస్టర్లు, 1 డీసీఎం, 23 గూడ్స్‌ క్యారియర్‌ ఆటోలు, 1 మినీ టాక్సీని అందజేశారు. logo