శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 06, 2020 , 00:11:16

సహకార పోరుకు సమాయత్తం

సహకార పోరుకు సమాయత్తం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అన్ని సొసైటీలను గెలుచుకునేలా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆయా సొసైటీల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రసమయి బాలకిషన్‌ వారివారి పరిధిలోని సొసైటీలను గెలుచుకునేలా ముందుకు కదులుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా సొసైటీలకు ఎన్నికల ఇన్‌చార్జిలను టీఆర్‌ఎస్‌ నియమించింది. సీఎం కేసీఆర్‌ వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసం ఈ విషయాన్ని రైతులకు సమగ్రంగా వివరించేలా టీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతున్నది. కొన్ని సొసైటీల్లో డైరెక్టర్‌ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోనున్నది. కొన్ని చోట్ల సొసైటీ చైర్మన్‌ పేర్లు కూడా ఖరారయ్యాయి. ఆయా సొసైటీల పరిధిలో ఏ వార్డుకు ఎవరిని నిలపాలి? ఎవరైతే సునాయసంగా గెలుస్తారు? ఏకగ్రీవంగా గెలుచుకునే స్థానాలు ఏవీ? తదితర అంశాలపై ప్రాథమికంగా టీఆర్‌ఎస్‌ సమాలోచనలను చేస్తున్నది. ఫలితంగా జిల్లాలోని 21 సొసైటీలను గెలుచుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 


ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు రైతన్నకు దన్నుగా నిలిచాయి. రైతుబంధు బీమా పథకం ద్వారా ఎకరానికి రెండు పంటలకు గానూ రూ.10 వేలను అందిస్తున్నది. ఇటీవలనే యాసంగి సాగుకు సంబంధించిన డబ్బులను విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నది. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు కుంటుంబాలకు భరోసానిచ్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. రైతు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించి, రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేసింది. త్వరలోనే రైతులకు రుణమాఫీ కూడా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికి వ్యవసాయాధికారి ఉండేలా ఏర్పాట్లు చేసి పంటల సాగు విధానంలో నూతన వంగడాలు గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వరంలా మారనున్నాయి.


సహకార ఎన్నికల్లో ప్రతిపక్షాలది నామమాత్రమే..

ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉనికి నామమాత్రమే అని చెప్పాలి. ఆ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో ఇప్పటికే చేరిపోయారు. ఇక ప్రతి ఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ సహకార ఎన్నికల్లో సైతం చేతులెత్తేస్తున్నాయి. మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీలకు కనీసం అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి. ఇక సహకార ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ఆ పార్టీల నేతల్లో కనిపించడం లేదు.


జిల్లాలో సొసైటీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి 

ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా సొసైటీల పరిధిలోని డైరెక్టర్లకు రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటుగా తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా పబ్లిష్‌ చేశారు. నేటి నుంచి ఆయా సొసైటీల్లోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లను చేశారు. జిల్లాలో మొత్తం 21 సొసైటీలున్నాయి. ఒక్కో సొసైటీలో 13 మంది డైరెక్టర్లకు గాను మొత్తం 273 డైరెక్టర్‌ పదవులకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయి. బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలను నిర్వహిస్తారు. జిల్లాలో  మొత్తం 62,966 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


logo