ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 05, 2020 , 00:30:38

జాతరెళ్లి పోదాం..

జాతరెళ్లి పోదాం..

 కొమురవెల్లి: కొమురవెల్లి పాత కామన్‌ వద్ద కొలువుదీరిన సమ్మక్క- సారక్క జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్వాహకులు చింతల రామ్మూర్తి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మల్లన్న జాతరకు వేదికైన కొమురవెల్లి 4 రోజుల పాటు జరిగే  సమ్మక్క- సారక్క  జాతరకు వేదిక కానున్నది. కొమురవెల్లి పాత కమాన్‌ వద్ద వెలిసి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క- సారక్కలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

 జాతర వివరాలు...

ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5గంటలకు పులిగుట్ట నుంచి సారలమ్మ తల్లి గద్దెపైకి వస్తుంది. 6వ తేదీన సాయంత్రం 5గంటలకు చిలకలగుట్ట సమ్మక్క తల్లి గద్దెపైకి వస్తుంది. 7వ తేదీన సమ్మక్క- సారక్క  ఇద్దరు తల్లులకు మొక్కులు చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 8వ తేది సాయంత్రం 5గంటలకు సమ్మక్క- సారక్క  ఇద్దరు తల్లులను వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

  ఏర్పాట్లు ముమ్మరం

బెజ్జంకి: మండలంలోని దేవక్కపల్లి, వడ్లూర్‌, తోటపల్లి, ముత్తన్నపేట, గుండారం గ్రామాల్లో ఈనెల 5,6,7 తేదీల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే గ్రామాల్లో  ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర జరిగే ప్రాంతాల్లో చదును చేసి, చలువ పందిర్లు ఏర్పాటు చేసి, గద్దెలకు రంగులు వేస్తూ అలంకరిస్తున్నారు.

 గోవర్ధనగిరిలో... 

అక్కన్నపేట:  మండలంలోని గోవర్ధనగిరి సంజీవరాయుడి గుట్టపై ఉన్న సమ్మక్క-సారలమ్మ వనదేవతలు. దీంతో ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు అమ్మవార్లను దర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గతేడాది సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా, సుమారు రూ. 1.75 లక్షల ఆదాయం వచ్చింది. ఈ నెల 5,6,7,8వ తేదీల్లో జాతర నిర్వహించేందుకు జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సంజీవరాయుడిపై గుట్టపై ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లేందుకు తాత్కాలికంగా మట్టి రోడ్డు పనులు, సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు గద్దెలకు రంగులతో పాటు భక్తులు విడిది కోసం పందిళ్లు, విద్యుత్‌ వెలుగులు, నీటి వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమ్మక్క సారలమ్మ కమాన్‌కు రంగులు వేసి ముస్తాబు చేశారు. జాతరలో కొబ్బరికాయలు, బెల్లం, లడ్డు, పులిహోర, హోటళ్లు, కోళ్ల దుకాణం తదితర చిరు దుకాణ వ్యాపారాలకు టెండర్లు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 23 మందితో కూడిన జాతర కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేయనున్నారు. 

  16 ఏండ్ల క్రితం గుట్టపై వెలిసిన 

సమ్మక్క-సారలమ్మ

సంజీవరాయుడి గుట్టపై 2004లో సమ్మక్క -సారలమ్మ వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన గొర్రెలు, మేకల కాపరులు కొందరు సమ్మక్కల పున్నం రోజుల్లో గుట్టకు వెళ్లగా పసుపు, కుంకుమ భరణి ఆకారంలో కనిపించింది. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడి వెళ్లి చూసి సమ్మక్క-సారలమ్మ వెలిసిందనీ, పూజలు చేశారు. అనంతరం కోయ పూజరులను రప్పించి అదే సంవత్సరం సమ్మక్క-సారలమ్మను ప్రతిష్ఠించి జాతరను నిర్వహించారు. గ్రామంలోని కులాల వారీగా ఒక్కో డైరెక్టర్‌గా ఎన్నుకొని అందులో నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కోశాధికారిని తిరిగి ఎన్నుకొని ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు ప్రస్తుత సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్‌ బూట్ల రాములు తెలిపారు. 

కూటిగల్‌లో సర్వం సిద్ధం

 మద్దూరు: మండలంలోని కూటిగల్‌లో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మల జాతర మహోత్సవాలకు నిర్వాహకులు సర్వసిద్ధం చేశారు. కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తున్న వనదేవతల జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఈ నెల 5 నుంచి 8వరకు జరిగే జాతరకు కమిటీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అమ్మవారి గద్దెలకు రంగులు వేయడంతో పాటు గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు గద్దెల పరిసరాలలో మినీట్యాంకులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాత్కాలికంగా మరుగుదొడ్ల నిర్మాణాలు, వైద్య శిబిరం ఏర్పాటుతో పాటు గద్దెల పరిసరాలను విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులను నడపనున్నారు. జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను జాతర కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేశారు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి జాతరను విజయవంతం చేయాలని జాతర కమిటీ సభ్యులు వివిధ ప్రసారసాధనాల ద్వారా ప్రచారాన్ని కొనసాగించారు.

నాలుగు రోజుల పాటు ఉత్సవాలు..

 సమ్మక్క-సారలమ్మ జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5న (బుధవారం) సాయంత్రం 4గంటలకు సారలమ్మ దేవత గద్దెకు వచ్చుట, 6న(గురువారం) సాయంత్రం సమ్మక్క గద్దెకు వచ్చుట, 7న మొక్కులు చెల్లించుట, 8న సాయంత్రం 4గంటలకు సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జాతరను విజయవంతం చేయాలి:  దోమ బాలమణి, సర్పంచ్‌, కూటిగల్‌

మినీమేడారంగా వెలుగొందుతున్న కూటిగల్‌ సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తులు విజయవంతం చేయాలి. ప్రతి రెండేండ్లకొక్కమారు జరిగే జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ప్రదానంగా భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, వైద్య, రవాణా సదుపాయాలు కల్పించాం.

  హాజరుకానున్న మంత్రి హరీశ్‌రావు

 నంగునూరు: జిల్లాలోని నంగునూరు మండలం అక్కెనపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతరకు ముస్తాబైంది. ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. 1994 సంవత్సరం నుంచి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు. జాతరలో మొదటి రోజు బుధవారం సారలమ్మను గద్దెకు తెచ్చుట, గురువారం సమ్మక్క దేవత గద్దెకు వచ్చుట, శుక్రవారం భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటారు. శనివారం అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయనున్నారు.  తాగు నీటి వసతి, విద్యుదీపాలంకరణ, రంగులు వేయుట తదితర పనులు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఆహ్వానించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంత్రి సహకారంతో ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వారు వివరించారు. 

 ఆలయ చరిత్ర 

నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివారులో పులిగుండ్లు ఉండేవి. 1994లో ఆ పులిగుండ్ల ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి మేకలను మేపుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. అదే సమయంలో ఆ పులిగుండ్ల ప్రాంతాన పసుపు ముద్దలు పడి ఉన్నాయి. దీంతో మేకల కాపరి ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివెళ్లారు. పసుపు ముద్దలు కనిపించడంతో భక్తులంతా సమ్మక్క-సారలమ్మ దేవతలే ఇలా ప్రత్యక్షమయ్యారని నిర్దారించుకున్నారు. ఇదే సమయంలో వరంగల్‌ జిల్లాలోని మేడారం వద్ద సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నది. జాతర సమయంలో సమ్మక్క-సారలమ్మ మనకు ప్రత్యక్షం కావడం ఆ తల్లి మహిమేనని గ్రామస్తులు నమ్మారు. అంతే కాకుండా సమ్మక్క సారలమ్మ పులిమీద స్వారీ చేస్తారు కాబట్టి ఆ పులిగుండ్ల ప్రాంతంలోనే ఈ పసుపు ముద్దలు కనబడ్డాయి. దీంతో ఆ దేవతలే ఇక్కడ ప్రత్యక్షమయ్యారని అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జాతరను నిర్వహిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలతో పాటు వారి మేనకోడలైన లక్ష్మి, నాగరాజు ప్రతిమల నిర్మాణాలను చేపట్టారు. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం కలిగి ఉంది. 

 వేలాదిగా తరలిరానున్న భక్తులు 

అక్కెనపల్లి సమ్మక్క-సారలమ్మ జాతరకు జిల్లా ప్రజలే కాకుండా ఇతర  జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. సారలమ్మ మొదటి రోజు గద్దెనెక్కడంతో మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పులిగుండ్ల ప్రాంతం నుంచి సారలమ్మ ప్రతిమలను తీసుకవచ్చి గద్దెనెక్కిస్తారు. రెండోరోజు సమ్మక్క ప్రతిమను తీసుకవచ్చి గద్దెనెక్కించడంతో రెండవ రోజు భక్తులు తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో భక్తులు సమ్మక్క- సారలమ్మకు నిలువెత్తు (బెల్లం) బంగారం ఇచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కడా చూసిన సమ్మక్క-సారలమ్మ మొక్కులు తీర్చుకోవడానికి నిలువెత్తు బంగారాన్ని ఇస్తున్నారు. కొంత మంది భక్తులు అమ్మవారిని కొత్తగా నిలుపుకోగా ఇది వరకు ఉన్న వారే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాలా మంది భక్తులు వరంగల్‌ జిల్లాలోని మేడారం జాతరకు వెళుతున్నారు. కొంత మంది భక్తులు వారికి దగ్గర్లో ఉన్నటువంటి జాతర్లకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

 సిద్ధమైన హుస్నాబాద్‌ 

హుస్నాబాద్‌ టౌన్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మచెరువు సమీపంలో నిర్వహించే సమక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 1995లో హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో సమ్మక్క- సారలమ్మ వెలిసింది. ఇరువై ఐదు ఏండ్లుగా జాతరను నిర్వహి స్తుండగా భక్తులు సైతం భారీగానే హాజరవుతున్నారు. హుస్నాబాద్‌లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు పట్టణానికి చెందిన ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం వందలాది మంది ప్రజలు తరలివస్తుం డటంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోతున్నది. స్థానిక సిద్దేశ్వర స్వామి గుట్టనుంచి ఈనెల 5వతేదీన తల్లి సమ్మక్కను 6వతేదీన బిడ్డ సారల మ్మలను కొయ్య రాజులైన నందం, జంపరాజుల నేతృ త్వంలో తీసుకువచ్చి జాత రను నిర్వహిస్తారు. 7వ తేదీన సమ్మక్క, సారలమ్మకు భక్తుల మొక్కు ల సమర్పణ, 8వ తేదీన వనప్రవేశం జరు గుతుందని జాతర నిర్వహణ కమిటీకి చెందిన మారుపాక చిన్నరాజయ్య, ఈర ఎల్లయ్య, ఈర రామస్వామి తెలిపారు.  

 ప్రత్యేక ఏర్పాట్లు..

హుస్నాబాద్‌ పట్టణ శివారు లో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర కుగాను ఆల యాన్ని రంగులతో అలం కరించారు. ఈ జాత రకు హాజరయ్యే భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు ఏర్పడ కుండా మున్సిపల్‌ అధికారు లు, జాతర నిర్వహణ కమిటీ యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. జాతరకు వచ్చే భక్తు లకు మంచినీటి వసతి, విద్యు త్‌, వైద్యం, స్నానాలు, మరు గుదొడ్ల సౌకార్యాలను ఏర్పా టు చేస్తున్నారు. భక్తులు మొక్కులు సమర్పించే విషయంలో ఇబ్బందులు లేకుండా బారికేడ్లతో క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. 

 పొట్లపల్లిలో అధిక సంఖ్యలో హాజరు కానున్న భక్తులు 

హుస్నాబాద్‌ రూరల్‌: మండలంలోని పొట్లపల్లి గ్రామంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద బుధవారం నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క- సారలమ్మ జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జాతర జరిగే ప్రాంతాన్ని రంగురంగుల కాగితాలతో అలంకరించడంతో పాటు అమ్మవారి గద్దెలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాతరకు వచ్చే రోడ్లను చదును చేసి మొరం పోయించారు. జాతర కు వచ్చే భక్తులకు తాగునీరు, విద్యుత్‌, మౌలిక సదు పాయాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అధి కారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గద్దెల చుట్టూ ఖాళీ స్థలాన్ని భక్తులు విడిది చేసేందుకు వీలుగా చదును చేయించారు. ఈ జాతరకు పొట్లపల్లి నుండే కాకుం డా పందిల్ల, కొండాపూర్‌, నవాబుపేట, సుంద ర గిరితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.       

 

ఎత్తు బెల్లాలతో కిటకిటలాడుతున్న కిరాణా దుకాణాలు


కోహెడ: రెండేళ్లకోసారి జరిగే వన దేవతలైన సమ్మక్క-సారలక్కల జాతరలు మండలంలోని మూడు గ్రామాల్లో జరుగనున్నాయి. మండల కేంద్రం నుంచి శ్రీరాములపల్లి మీదుగా హుస్నాబాద్‌ వెళ్లే దారిలో 6 కి.మీ. దూరంలో ఉన్న పరివేద గ్రామం దేవల్‌ చెరువు వద్ద సమ్మక్క-సారలక్క జాతర జరుగుతున్నది. ఇక్కడ 5న ఉదయం సారలక్క, సాయంత్రం సమ్మక్క గద్దెకు చేరుకుంటారు. 6న భక్తులు మొక్కులు సమర్పిస్తారు. అలాగే మండల కేంద్రం నుంచి కరీంనగర్‌ వెళ్లే దారిలో 5 కి.మీ.ల దూరంలో ఉన్న వింజపల్లి గ్రామం శివారు మోయ తుమ్మెద వాగు నల్లబండ వద్ద జాతర జరుగుతుంది. అలాగే కోహెడ నుండి సిద్దిపేట వెళ్లే దారిలోగల తంగళ్లపల్లి గ్రామం శివారులోని సింగరాయ ప్రాజెక్టు సమీపంలో జాతర జరుగుతుంది. ఈ రెండు గ్రామాల్లో 5వ తేదీ రాత్రి సారలక్క, 6న రాత్రి సమ్మక్కలు గద్దెలకు చేరుకుంటారు. 7న ఉదయం భక్తులు మొక్కులు సమర్పిస్తారు. ఆయా గ్రామాల జాతరల కమిటీలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గద్దెలకు రంగులు వేసి తోరణాలు కట్టారు. నీరు, కరెంటు, రహదారి సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనాలు పూర్తిచేసుకొని ఇళ్లల్లో సమ్మక్క-సారలక్క పండుగలు జరుపుకుంటున్నా రు. కాగా ఇప్పటికే గ్రామాల్లో సమ్మక్క-సారలక్క జాతరల సందడి జోరందు కున్నది. మొక్కులు ఉన్నవారు ఎత్తుబెల్లాలు ఇస్తున్నారు. 

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి..

 సమ్మక్క-సారమ్మ జాతరలకు వచ్చి మొక్కులు సమర్పించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఏసీపీ మహేందర్‌ జాతరల కమిటీ సభ్యులకు సూచించారు. మంగళవారం మండలంలోని పరివేద, వింజపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న జాతర స్థలాలను పరిశీలించారు. జాతర కమిటీలు ఏర్పాటు చేసిన బారికేడ్లు, నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, దుకాణాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు భక్తులు జాతర స్థలాలకు వస్తారని జాతర కమిటీలు 24 గంటలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాతర కమిటీల సభ్యులు కంకనాల నర్సింహారెడ్డి, చాడ సుదర్శన్‌ రెడ్డి, అంజయ్య, పాము శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


logo