సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 03, 2020 , 22:51:54

కోహెడలో ఎలుగు బంట్ల సంచారం

కోహెడలో ఎలుగు బంట్ల సంచారం

కోహెడ : మండలంలో ఎలుగు బంట్ల సంచారం ఎక్కువైంది. పట్టపగలే ఎలుగు బంట్లు సంచరిస్తుండడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి గ్రామాల్లోకి వస్తుండడంతో చేసేదేమీ లేక బిక్కుబిక్కు మంటున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని భీతిల్లుతున్నారు. ముఖ్యంగా రాత్రిల్లు వివిధ గ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ముందుగానే ఇండ్లకు చేరుకుంటున్నారు. రాత్రనక, పగలనక వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బావుల వద్దకు వెళ్తున్నారు. ప్రధానంగా సింగరాయ ప్రాజెక్టు పరిసర గ్రామాలు తంగళ్లపల్లి, కూరెల్ల, బస్వాపూర్‌, ఆరెపల్లి గ్రామాల రైతులకకు ఇబ్బందికరంగా మారింది.  ప్రాజెక్టులో నీటి వసతి ఉండి అటవీ ప్రాంతం కావడంతో ఎలుగు బంట్లు ఈ ప్రాంతంలో మాకాం వేశాయి. 


ఇటీవల ఆరెపల్లి గ్రామంలో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో ఎలుగు బంటి చిక్కుకుంది. అటవీ శాఖ అధికారులు దానిని విడిపించి చికిత్స చేసి అక్కడే వదిలి పెట్టారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం గుండారెడ్డిపల్లి గ్రామంలోకి ఎలుగుబంటి రాత్రి 8 గంటలకు వచ్చి సీసీ కెమెరాలో చిక్కింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే బస్వాపూర్‌ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పట్టపగలు సంచరించగా కొందరు యువకులు సెల్‌ఫోన్‌లలో చిత్రించగా మండలంలో సదరు వీడియో గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అటవీ శాఖ అధికారులు ఎలుగు బంట్లను బందించి అడవుల్లో వదిలిపెట్టాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.


logo