మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 02, 2020 , 23:05:56

పట్నమేసి..మొక్కు తీర్చి..

పట్నమేసి..మొక్కు తీర్చి..
  • వైభవంగా మల్లన్న మూడో వారం
  • మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
  • కొమురవెల్లి మల్లన్న దర్శనంతో భక్తుల పరవశం
  • సుమారు 30వేల మందికి పైగా దర్శనం

 చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి  మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. ఆలయంలో భక్తులు మల్లన్న దర్శనంతో మంత్ర ముగ్ధులు అవుతున్నారు. స్వామి వారి నామస్మరణలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. 3వ ఆదివారం సందర్భం గా 30వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు.  భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. 


అంతేకాకుండా మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి ఒడి బియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏఈవోలు రావుల సుదర్శన్‌, గంగా శ్రీనివాస్‌, పునరుద్ధరణ కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, యావజుల ఐలయ్య, ఏగుర్ల మల్లయ్య, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన కుటుంబ సభ్యులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.


 సీఎం కేసీఆర్‌ పాలనలో ఆలయాలకు మహర్దశ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దేవాలయాలకు మహర్దశ పట్టిందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, తెలంగాణ వీరశైవ లింగాయత్‌, లింగబలిజ సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ముస్తాపురి అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్న ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో అర్చకులు, కొమురవెల్లి, చేర్యాల మండల వీరశైవ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సోమేశ్వర్‌, జనగామ జిల్లా అధ్యక్షుడు బక్కెర సిద్ధయ్య తదితరులు ఉన్నారు.


‘మల్లన్న’ను దర్శించుకున్నడిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, రామగుండం ఎమ్మెల్యే..

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని శాసన మండలి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఆదివారం దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్‌ కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి చేరుకోగానే ఆలయవర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం స్పీకర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌ తన కుటుంబ సభ్యులతో దర్శించుకోగా  ఆలయవర్గాలు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.


logo