మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 02, 2020 , 22:58:11

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
  • మెదక్‌ రీజియన్‌ నుంచి 235 బస్సులు
  • నేటి నుంచి 9వ తేదీ వరకు
  • బస్సుల పర్యవేక్షణకు టీంల ఏర్పాటు

సంగారెడ్డి టౌన్‌ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. మెదక్‌ రీజియన్‌ పరిధి నుంచి 235 బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రీజియన్‌ పరిధిలోని మెదక్‌, సిద్దిపేట, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ డిపోల నుంచి 220 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అవే కాకుండా హుస్నాబాద్‌ డిపో నుంచి అదనంగా మరో 35 బస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి కేటాయించిన బస్సులను వరంగల్‌ కేంద్రంగా పర్యవేక్షణ చేయనున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులన్నింటిని వరంగల్‌కు పంపించి అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు తిప్పనున్నారు. 


ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్‌ డిపో నుంచి 40 బస్సులు, నారాయణఖేడ్‌ డిపో నుంచి 20 బస్సులు, సంగారెడ్డి డిపో నుంచి 35 బస్సులు, జహీరాబాద్‌ డిపో నుంచి 20 బస్సులు, సిద్దిపేట డిపో నుంచి 40 బస్సులు, దుబ్బాక డిపో నుంచి 15 బస్సులు, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నుంచి 30 బస్సులను నడుపుతున్నారు. వీటికి అదనంగా హుస్నాబాద్‌ నుంచి మరో 35 బస్సులను తిప్పనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా భక్తులు మేడారం జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసి రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులను నడిపేందుకు రాష్ట్రంలోని అన్ని రీజియన్‌ల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే మెదక్‌ రీజియన్‌ నుంచి 235 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి నడుపుతున్న బస్సులను వరంగల్‌ కేంద్రంగా పర్యవేక్షణ చేసి అక్కడి నుంచే బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పనున్నారు. అక్కడే జిల్లా ప్రత్యేక అధికారులను నియమించారు. 


రద్దీ పెరిగితే అదనపు బస్సులు 

మేడారం జాతరకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మెదక్‌ రీజియన్‌ పరిధిలో 235 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా రీజియన్‌ పరిధిలో ప్రత్యేక బస్సులను మేడారం జాతరకు ఏర్పాటు చేస్తాం. ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతకు బస్సులను తిప్పనున్నాం. 

- రాజశేఖర్‌, ఆర్‌ఎం 


logo