శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Feb 01, 2020 , 23:04:56

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌

సంగారెడ్డి టౌన్‌: బీఎస్‌ఎన్‌లో వీఆర్‌ఎస్‌ పథకం అమలు చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)లో కేంద్ర ప్రభుత్వం వీఆర్‌ఎస్‌ పథకం తీసుకురావడంతో 243 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాల నివారణ పేరుతో వీఆర్‌ఎస్‌ పథకం జనవరి 31వ తేదీతో అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 373 మంది ఉద్యోగులు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తున్నారు. వారిలో సగం మందికి పైగా అధికారులు, ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. నష్టాలను నివారిస్తాం..సంస్థను కాపాడుతాం అంటూ 50ఏండ్లు దాటిన వారు ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తి స్థాయికాలం వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించడంతో అర్హత ఉన్నవారందరూ దరఖాస్తులు చేసుకున్నారు. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 19మంది అధికారులు ఉండగా 224 మంది ఉద్యోగులు ఉన్నారు. చాలా మందికి వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యం బలవంతంగా అర్హత ఉన్న ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో వీఆర్‌ఎస్‌ ఇష్టం లేకపోయిన దరఖాస్తులు చేసుకున్నారు. 


243 మందికి వీఆర్‌ఎస్‌ వర్తింపు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 243 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 373 మంది ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకంలో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ ఒత్తిడి మేరకు 243 మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ స్వచ్ఛంద పదవీ విరమణ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల కావడంతో 29,30,31 తేదీల్లో ఉద్యోగులకు రిలీవ్‌ ఆర్డర్లు అందజేశారు.  మిగిలిన 130 మంది ఉద్యోగులు వారి వారి స్థానాల్లోనే పనిచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులు ఇంటిదారి పట్టిన వారి స్థానాల్లో తాత్కాలిక సేవలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఒకే సారి ఉమ్మడి జిల్లాలో 243 మంది వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. అవకాశం ఉన్న అన్ని విభాగాలకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని తీసుకుని యథావిధిగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. 


50ఏండ్ల దాటినవారికి వీఆర్‌ఎస్‌

కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌లో నష్టాలను నివారించి లాభాల బాటలో పట్టిస్తామని, ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, అందులో 50ఏండ్లు దాటిన వారందరికీ స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 50ఏండ్లు దాటిన వారందరు ఉద్యోగ విరమణ తీసుకుంటే పూర్తి కాలం వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేస్తున్న ఉద్యోగులను సాగనంపి ప్రైవేట్‌ రంగానికి అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని పలువురు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పేరుకే నష్టాల నివారణ కానీ ప్రభుత్వం రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రైవేట్‌ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నించిందని, అందులో పూర్తిగా విజయం సాధించిందన్నారు.


logo