మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 23:03:53

రక్షణ కవచం హెల్మెట్‌

రక్షణ కవచం హెల్మెట్‌

సిద్దిపేట టౌన్‌ : హెల్మెట్‌ రక్షణ కవచమని, విధిగా సీటు బెల్టు, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సూచించారు. 31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా శనివారం హెల్మెట్‌ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ జోయల్‌ డెవిస్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైనీ ఐపీఎస్‌ అఖిల్‌ మహజన్‌, జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డితో కలిసి హెల్మెట్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 సంవత్సరాన్ని రోడ్డు సెఫ్టీ, ఉమెన్‌ సెఫ్టీ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు హెల్మెట్‌ ధరించాలని, ఇంటి యజమాని బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా హెల్మెట్‌ గుర్తు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌, సీటు బెల్టు వినియోగంపై యువతలో చైతన్యం తెస్తున్నామన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా మద్యం తాగి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపవద్దన్నారు. 


రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్‌ నిబంధనలు వాహనదారులందరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు. అంతకు ముందు సిద్దిపేట పట్టణ ప్రధాన రోడ్లమీదుగా హెల్మెట్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు రామేశ్వర్‌, బాలాజీ, సీఐలు పర్శరామ్‌గౌడ్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రుబీనా, ట్రాఫిక్‌ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo