శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Feb 01, 2020 , 00:07:39

పనులు త్వరగా పూర్తి చేయండి

పనులు త్వరగా పూర్తి చేయండి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అభివృద్ధి పనులు వేగవంతం చేయ డం లేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిపల్‌లో పట్టణ అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చే యాలని, చెత్తను రోడ్లుపై వేయకుండా ప్రజలను చైతన్యం తీసుకురావాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయాలన్నారు. పారిశుద్ధ్య అధికారులు మున్సిపల్‌కు 12 వేల చెత్త బుట్టలు కావాలని కోరాగా, వెంటనే మంత్రి హరీశ్‌రావు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రెండు రోజుల్లో బుట్టలు పంపిణీ చేయాలన్నారు. మున్సిపల్‌ ప్రత్యేక అధికారి, ఆర్డీవో రమేశ్‌బాబు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌ పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఏఈ శ్రీధర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్‌లో చెత్త సేకరణ ఎలా చేస్తున్నారో పరిశీలించి, ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో నిర్మాణం చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ ప్రతాప్‌కుమార్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, జహీరాబాద్‌ సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, సినీ నిర్మాత మల్కాపూరం శివకుమార్‌, తహసీల్దార్‌, ఎంపీడీవో రాములు, మున్సిపల్‌ రెవెన్యూ అధికారి ప్రభాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ ప్రతాప్‌కుమార్‌, డీఈఈలు కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


logo