గురువారం 04 జూన్ 2020
Siddipet - Jan 29, 2020 , 02:38:38

సరస్వతీ నమస్తుభ్యం

సరస్వతీ నమస్తుభ్యం
  • - రేపు వసంత పంచమి
  • - ముస్తాబైన వర్గల్‌ విద్యాధరిక్షేత్రం
  • - పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తజనం
  • - అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో కిటకిటలాడనున్న ఆలయం

తెలంగాణలో రెండో సరస్వతీ దేవాలయంగా విరాజిల్లుతున్న వర్గల్‌ విద్యాధరి క్షేత్రం వసంత పంచమి మహోత్సవానికి ముస్తాబైంది. అమ్మవారి జన్మదినంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సంవత్సరం మొత్తంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు ఆలయ వర్గాలు అంచనా వేయగా, గురువారం అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారి సన్నిధి మార్మోగనున్నది.


వర్గల్‌: నిత్యానందలకరిణి, విద్యాపాణి, చదువులతల్లి వర్గల్‌ సరస్వతీమాత ఆలయం గురువారం జరిగే శ్రీపంచమి(వసంత)వేడుకలకు సర్వాంగ సుందరగా ముస్తాబైంది. హైదారాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలకు 55 కి.మీ దూరంలో వర్గల్‌ మండలకేంద్రంలో వెలసిన విద్యాసరస్వతీమాత 1991 నుంచి భక్తుల చేత జయ జయ నీరాజనాలు అందుకుంటూ ఆశ్రితుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతున్నది. ప్రతి యేటా మాఘమాసంలో జరిగే శ్రీపంచమి వేడుకలలో పాల్గొనేందుకు రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వర్గల్‌ విద్యాధరిక్షేత్రానికి తరలివస్తుంటారు. తెలంగాణలోనే రెండో బాసర సరస్వతీ దేవాలయంగా విరాజిల్లుతున్న వర్గల్‌ సర్వతీమాత పంచమి వేడుకలకు ముస్తాభైంది.ఆలయలంలో శాశ్వత ప్రాతిపాదికంగా ఏర్పాటు చేసిన మండపాలు, చండీహోమాది యాగశాల, సారస్వతీమండపం విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో ,రంగులమయంతో తీర్చిదిద్దారు.


విశేష కార్యక్రమాలు

వర్గల్‌ విద్యాధరిక్షేత్రంలో జరిగే శ్రీపంచమి వేడుకల సందర్భంగా గురువారం ఉదయం తెల్లవారు జామున 4 గంటలకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో వేద పండితులు గణపతిపూజ, అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. కార్యక్రమంలో పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి   పాల్గొంటారు. అభిషేకాలనంతరం, అలంకార సేవ ఆ తరువాత గిరిప్రదక్షిణం సేవలో అమ్మవారు ఊరేగుతారు. 8-30 గంటలకు లక్షపుష్పార్చన 11-30 గంటలకు 56 రకాల మధురపదార్థంతో (చప్పన్‌భోగ్‌) నివేదన జరిపిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత  పీఠాధిపతులతో అనుగ్రహభాషాణం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.


ప్రతిభా పురస్కారాలు

మండలంలోని 2019-20 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జీపీఏ లో మంచి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. 


 ఆర్టీసీ బస్సు సౌకర్యం

శ్రీపంచమి వేడుకలను పరస్కరించుకొని హైదారాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. వీటికితోడు  గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన పలు బస్సులను నడుపనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.


logo