బుధవారం 03 జూన్ 2020
Siddipet - Jan 27, 2020 , 23:42:07

గులాబీ పట్నాలు

గులాబీ పట్నాలు
  • - మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక పూర్తి
  • - తొలుత సభ్యులతో ప్రమాణస్వీకారం
  • - ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఓటేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
  • - ప్రశాంతంగా ముగిసిన ఎన్నిక ప్రక్రియ
  • - కోలాహలంగా మున్సిపల్‌ కార్యాలయాలు
  • - హాజరైన ఎన్నికల అబ్జర్వర్‌ హరిచందన, జేసీ పద్మాకర్‌
  • - హుస్నాబాద్‌లో ఇండిపెండెంట్‌కు మద్దతు తెలిపి బోర్లా పడిన కాంగ్రెస్‌
  • - పట్టణాల్లో హోరెత్తినసంబురాలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ :పుర పీఠాలు గులాబీ వశమయ్యాయి.. ఎన్నికల్లో జైతయాత్ర కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పాలకవర్గాలే కొలువుదీరాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ నాలుగు మున్సిపాలిటీలను సునాయసంగా దక్కించుకున్నది. సోమవారం ఉదయం నాలుగు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి తొలుత సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు ఎన్నిక నిర్వహించగా, నాలుగుచోట్ల టీఆర్‌ఎస్‌కు చెందిన సభ్యులే ఎన్నికయ్యారు. గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా నేతి చిన్న రాజమౌళి, దుబ్బాక చైర్‌పర్సన్‌గా గన్నె వనిత, హుస్నాబాద్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, చేర్యాల చైర్‌పర్సన్‌గా అంకుగారి స్వరూప ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు పురపాలికల్లో గెలిచిన స్వతంత్రులు అధికార టీఆర్‌ఎస్‌కే జైకొట్టారు. దుబ్బాకలో ఎమ్మెల్యే సోలిపేట, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, చేర్యాలలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓటేశారు. చేర్యాలలో గెలుపొందిన ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. హుస్నాబాద్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులు ఇండిపెండెంట్‌కు మద్దతు తెలిపి బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక్కడ ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ సభ్యురాలు చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హరిచందన, జేసీ పద్మాకర్‌ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో గులాబీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. 


 జిల్లాలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు ఉదయం 11 గంటలకు ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సభ్యులతో అధికారులు తొలుత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు నామినేషన్లను స్వీకరించారు. 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్‌కు చెందిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎన్నికయ్యారు. గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నేతిచిన్న రాజమౌళి, దుబ్బాక చైర్మన్‌ గన్నె వనిత, హుస్నాబాద్‌ చైర్మన్‌ ఆకుల రజిత, చేర్యాల చైర్మన్‌ అంకుగారి స్వరూప ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. గజ్వేల్‌ ఐవోసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ హరిచందన పర్యవేక్షణ చేశారు. గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా నేతి చిన్న రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జాకీరొద్దీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గానూ 13 వార్డులు టీఆర్‌ఎస్‌ గెలువగా, స్వతంత్రులు 6మంది గెలిచారు. వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో మొత్తం టీఆర్‌ఎస్‌ బలం 19కి చేరింది. ఒక వార్డు కాంగ్రెస్‌ గెలుచుకుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. 


ఇక్కడ ఎన్నికలను సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌గా గన్నె వనిత, వైస్‌ చైర్మన్‌ అధికం సుగుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గానూ 9 టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, స్వతంత్రులు 9 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలం 18కి చేరింది. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి నిర్వహించారు. మొత్తం వార్డులు 20కి గానూ టీఆర్‌ఎస్‌ 9 గెలుచుకుంది. స్వతంత్రులు ఇద్దరి మద్దతుతో మొత్తం 11 కాగా, ఎమ్మెల్యే ఓటుతో 12 ఓట్లయ్యాయి. దీంతో హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఆకుల రజిత, వైస్‌ చైర్మన్‌గా ఐలేని అనిత ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. చేర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా వరంగల్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు టీఆర్‌ఎస్‌ 5 స్థానాలు గెలుచుకుంది. ఇద్దరు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో సంఖ్య 7కు చేరింది. ఎక్స్‌ అఫీషియో ఓటుతో 8 ఓట్లున్నాయి. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సభ్యులు ఎవరు హాజరు కాలేదు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు, జేసీ పద్మాకర్‌, జడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. దీంతో జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 


విజయోత్సవ సంబురాలు 

జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ విజయోత్సవ సంబురాలు నిర్వహించింది. ఎన్నికలేవైనా అది గులాబీ పార్టీదే విజయమని మరోమారు రుజువైందని కార్యకర్తలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.logo