శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:24:59

కొమురవెల్లి కిటకిట

కొమురవెల్లి కిటకిట
  • వైభవంగా లష్కర్‌ వారం
  • స్వామి వారి దర్శనంతో భక్తుల పరవశం
  • 50వేలకు పైగా తరలివచ్చిన భక్తజనం

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్‌వారం సందర్భంగా  క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. లష్కర్‌వారానికి సికింద్రాబాద్‌ భక్తులతోపాటు కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న దర్శనానికి 50వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌  తెలిపారు.   శనివారం సాయంత్రం నుంచే భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ నిర్వహణలోని గదులు ఖాళీగా లేకపోవడంతో ప్రైవేట్‌ గదులను కిరాయికి తీసుకుని బస చేశారు. ఆదివారం భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకం, అర్చన, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు, పట్నాలు, బోనాలు చేసి మల్లన్నకు మొక్కులు తీర్చుకున్నారు.


వేకువజామునే ప్రాంరభమైన దర్శనాలు

మల్లన్న క్షేత్రానికి వచ్చిన భక్తులు వేకువజామునే నిద్ర లేచి పవిత్ర కోనేటిలో స్నానం అచరించి క్యూలైన్లలో 5 గంటల పాటు వేచి ఉండి స్వామిని దర్శించుకున్నారు. ఆలయవర్గాలు వేకువజామునే ప్రత్యేక, శీఘ్ర దర్శనాల కౌంటర్లను తెరిచి  టిక్కెట్లను విక్రయించారు. అలాగే, గుట్టపైన ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో సీఐ రఘు నేతృత్వంలో  ఎస్‌ఐలు మోహన్‌బాబు, నరేందర్‌రెడ్డి, సతీశ్‌ బందోబస్తు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, బాల్‌రెడ్డి, ఏగుర్ల మ లయ్య, నాగిరెడ్డి, యావజుల ఐల య్య, ఏఈవో సుదర్శన్‌, పర్యవేక్షకు డు శేఖర్‌, సిబ్బంది  పోచయ్య, అం జయ్య, విజయ్‌కుమార్‌, మేకల పో చయ్య, జగదీశ్వర్‌, నర్సింహులు, మాధవి భక్తులకు సేవలందించారు.


logo