మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 26, 2020 , 00:41:51

కారుకే జయహో

 కారుకే జయహో


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల్లో కారుదే జోరు.. అన్నింటా విజయదుందుభి మోగించింది. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో వార్‌ వన్‌సైడ్‌. దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలను గెలుచుకొని జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌, దుబ్బాక మున్సిపాలిటీల్లో ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 72వార్డుల్లో  టీఆర్‌ఎస్‌ 36, కాంగ్రెస్‌ 12, బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ 19, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో గెలుపొందిన అభ్యర్థులంతా క్యాంపులకు తరలివెళ్లారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. 

నాలుగు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం

జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గులాబీ జెండాను ఎగురవేసింది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు పట్టం కట్టారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌ 13 చోట్ల, రెబల్స్‌ 6 చోట్ల విజయం సాధించి, మొత్తం 19 స్థానాలను గెలుచుకున్నది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు కాంగ్రెస్‌ 1 వార్డులో గెలిచింది.మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నియోజకవర్గంలోని సీనియర్‌ నాయకులు, ప్ర జాప్రతినిధులు మున్సిపల్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్ర చారం నిర్వహించి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా రు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 20 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 9 చోట్ల, రెబల్స్‌ 8, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. రెబల్స్‌ అభ్యర్థులంతా స్థానిక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డిని కలిసి వారి మద్దతు తెలియజేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ 17 వార్డులు సొంతం చేసుకుంది. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 9 చోట్ల, కాంగ్రెస్‌ 6, బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ 3 చోట్ల గెలిచారు. రెబల్స్‌ అభ్యర్థులు స్థానిక శాసన సభ్యులు వొడితెల సతీశ్‌కుమార్‌ను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ 2 గెలుపొందారు. వీరిద్దరు కూడా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో నాలుగు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది.

ఫలించిన ఎమ్మెల్యేల కృషి

మున్సిపల్‌ ఎన్నికల్లో అంతా మీరై ప్రచారం నిర్వహించాలని అన్ని మున్సిపాలిటీలు గెలువాలని సీఎం కేసీఆర్‌ స్థానిక శాసన సభ్యులకు దిశానిర్దేశం చేయడంతో ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు వార్డుల్లో ప్రచారం నిర్వహించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో గులాబి శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది.

సంబురాల్లో గులాబీ సైన్యం

ఎన్నికల్లో విజయం సాధించడంపై జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల సారథ్యంలో ఎన్నికలేవైన విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదే అని గులాబీ సైన్యం సంబురాలు నిర్వహించారు. ఎన్నికల్లో గడపగడపకూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకెళ్లి ప్రజలను ఓట్లు అడిగారు.logo