గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jan 26, 2020 , 00:41:11

గులాబీ రెపరెపలు

గులాబీ రెపరెపలు


(సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి) మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ మరోసారి తన సత్తా చాటుకున్నది. ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించి అన్ని స్థానాలను కైవసం చేసుకున్నది. పల్లెతో పాటు పట్టణ ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నట్లు ఈ ఎన్నికలతో రుజువైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 15 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా, అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. 10 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రాగా, 4 చోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులతో ఎక్స్‌ అఫీషియో ఓటుతో నారాయణఖేడ్‌ మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనున్నది. ఉమ్మడి జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో మొత్తం 309 వార్డులకు గానూ 173 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 35మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా, అందులో మెజార్టీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌. మొత్తంగా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. గెలుపొందిన టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ముఖ్య నేతల వద్దకు తరలివెళ్లారు. అన్ని మున్సిపాలిటీల నుంచి గెలిచిన వారు క్యాంపులకు తరలివెళ్లారు. టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు రావడంతో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఎన్నిక ఏదైనా, టీఆర్‌ఎస్‌దే విజయమంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొట్టకపోగా, కాంగ్రెస్‌ కేవలం ఒక్క వార్డుతో సరిపెట్టుకుంది. ఇక బొల్లారం మున్సిపాలిటీలో 22 వార్డులకు గానూ 17 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

ఆ ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండా

ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌, మెదక్‌ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో సంగారెడ్డి, నారాయణఖేడ్‌, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక మున్సిపాలిటీల్లో పోటీ వాతావరణం కనిపించింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు లభించకపోవడంతో రెబల్స్‌గా బరిలో దిగారు. వారితోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోటీ నెలకొనడం గమనార్హం. సంగారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 38 వార్డులకు గానూ 18 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వారు టీఆర్‌ఎస్‌ నేతలతోనే ఉన్నారు. చేర్యాలలో 12 వార్డులకు గానూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ 5 చొప్పున వార్డులను కైవసం చేసుకున్నాయి. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరు కూడా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులే. అలాగే హుస్నాబాద్‌లో 20 స్థానాలకు 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 6 స్థానాలను కాంగ్రెస్‌, 2 స్థానాలను బీజేపీ, 3 స్థానాలను స్వతంత్ర అభ్యరుథలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ కూడా ముగ్గురు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ కావడం గమనార్హం. అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గెలుపొందిన తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కలిసి మంత్రుల వద్దకు వెళ్లినట్లు తెలిసింది.

ఎక్స్‌అఫీషియో ఓటుతో ‘ఖేడ్‌'పీఠం

ఎక్స్‌అఫీషియో ఓటుతో నారాయణఖేడ్‌ మున్సిపల్‌ పీఠాన్ని అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనున్నది. ఇక్కడ కాంగ్రెస్‌కు 8, టీఆర్‌ఎస్‌కు 7స్థానాలొచ్చాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌ కూడా ఇక్కడే ఓటు వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ‘ఖేడ్‌'పై కూడా గులాబీ జెండా ఎగురనున్నదనే ధీమాతో ఉన్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ కంటే ఓ స్థానాన్ని ఎక్కువే సాధించుకున్నప్పటికీ ఖేడ్‌ పీఠాన్ని పొందకపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.


logo