బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 26, 2020 , 00:40:07

పురపోరులో టీఆర్‌ఎస్‌ జయభేరి

పురపోరులో టీఆర్‌ఎస్‌ జయభేరి


చేర్యాల, నమస్తే తెలంగాణ: పట్టణ సారుపత్య కలిగిన గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏర్పాటైన చేర్యాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాఎగురనుంది. తొలి మున్సిపాలిటీ ఎన్నికలలో 12 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 5, ఇండిపెండెంట్లు 2 స్థానాలలో విజయం సాధించారు. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ దక్కించుకోవాలంటే 7 స్థానాలు అవసరం కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ 5 స్థ్ధానాలతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లు వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడుగా ఎక్స్‌అఫీషియో సభ్యులు(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) ఓట్లు సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి పడనుండడంతో ఇక చేర్యాల మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోనున్నది. ఈ నెల 27వ తేదీన నిర్వహించే చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎన్నికల ముందు అనారోగ్యానికి గురైనప్పటికీ దవాఖాన నుంచే ఎమ్మెల్యే పార్టీ వార్డు ఇన్‌చార్జిలకు, ముఖ్య నాయకులు ఆదేశాలు, సూచనలు చేశారు. చివరి రోజున రెండు వార్డుల్లో ప్రచారం సైతం నిర్వహించారు. దీనికి తోడుగా శాసన మండలి చీఫ్‌విప్‌ బొడెకుంటి వెంకటేశ్వర్లు, ఆప్కో రాష్ట్ర మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య ప్రచారాన్ని వార్డులలో అభ్యర్థులతో కలిసి సాగించారు. అభ్యర్థుల విజయం కోసం నిత్యం నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి గుజ్జ సంపత్‌రెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి ప్రత్యేక వ్యుహాలు రచించి వాటిని పక్కగా అమలు చేసి, పార్టీ విజయానికి కృషి చేశారు.

సంబురాలు జరుపుకున్న శ్రేణులు

మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో ఏకపక్షంగా ఫలితాలు రావడంతో పాటు చేర్యాల మున్సిపల్‌లో మంచి ఫలితాలు సాధించడంతో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ మాజీ అధ్యక్షుడు శివగారి అంజయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొడిగం మహిపాల్‌రెడ్డి, టౌన్‌ సెక్రటరీ గోనె హరి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజులతో పాటు పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.


logo