మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 24, 2020 , 23:28:31

రేపు కొమురవెల్లి మల్లన్న లష్కర్‌ వారం

రేపు కొమురవెల్లి మల్లన్న లష్కర్‌ వారం


చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్నక్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా లష్కర్‌ వారానికి సికింద్రాబాద్‌ భక్తులతో పాటు కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన భక్తులు  భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు. సికింద్రాబాద్‌ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్న దర్శించుకుని మొక్కులు తీర్చుకోనుండడంతో రెండో ఆదివారాన్ని లష్కర్‌వారంగా ఆనాదిగా పిలుస్తున్నారు. శనివారం సాయంత్రానికి భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకొని మల్లన్నను దూళి దర్శనం చేసుకోనున్నారు. లష్కర్‌ వారం సందర్భంగా భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఒడి బియ్యం, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. లష్కర్‌ వారం సందర్భంగా హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ నేతృత్వంలో సీఐ రఘు బందోబస్తు నిర్వహిస్తారు. 

భక్తులకు అన్ని సదుపాయాలు : మేక సంతోష్‌, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాల్లో లష్కర్‌వారం సందర్భంగా తరలివస్తున్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌ తెలిపారు. శుక్రవారం ఆలయంలో డిప్యూటీ కమిషనర్‌ టి.వెంకటేశ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ స్వామి వారి క్షేత్రానికి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవాలని కోరారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఆదివారం అన్ని వసతులు కల్పిస్తున్నామని  వివరించారు. అలాగే పార్కింగ్‌ స్థలాలు పరిశీలించడంతో పాటు క్షేత్రంలో అన్ని ప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ చేసినట్లు వివరించారు. కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, మంతెన బాల్‌రెడ్డి, ఏగుర్ల మల్లయ్య, ఏఈవో రావుల సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo