గురువారం 04 జూన్ 2020
Siddipet - Jan 23, 2020 , 01:12:02

చేతిరాత.. మార్చు తలరాత

చేతిరాత.. మార్చు తలరాత


సిద్దిపేట రూరల్ : అందమైన అక్షరాలు చేతిద్వారా రాలితే.. వాటి అందం మరింత పెరుగుతుంది. అందమైన అక్షరాలు మనిషి లోపలి అందాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తాయని.. ముత్యాల్లాంటి చేతిరాతతో మన ప్రవర్తన, ఆలోచనల్ని అంచనా వేసుకోవాలంటున్నారు ప్రముఖ చేతి రాత నిపుణుడు ఎజాస్ అహ్మద్. నేడు ప్రపంచ చేతిరాత దినోత్సవం సందర్భంగా 1995 నుంచి శిక్షణ ఇస్తున్న ‘అహ్మద్’పై కథనం.

1500లకు పైగా పాఠశాలల్లో శిక్షణ

స్వాదు ఫలములెపుడు సమముగా పంచుకో.. ఒంటి తినవలదు ఒప్పు కాదు... అన్న నీతి వ్యాక్యానికి వ్యాఖ్యానంగా లక్షల మంది విద్యార్థుల చేతిరాత మార్చానన్నారు ఎజాస్ అహ్మద్. దాదాపు 1500లకు పైగా పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో సులభతరమైన చేతిరాత నేర్పిస్తున్నారు. ట్రేసింగ్ పద్ధ్దతి ద్వారా ‘అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే’ అనే పుస్తకాన్ని అందజేసి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. చిట్కాలతోపాటు కథలు పద్యాలు, యోగా వినోదంతో పాటు వినయం-విజ్ఞానం-విచక్షణతో కూడిన శిక్షణ ద్వారా మూడు భాషల్లో సులభ రీతిలో చేతిరాతపై శిక్షణ ఇస్తున్నారు. డిఫరెంట్ స్ట్రోక్స్ సంస్థ ద్వారా గురుకులాల కార్యదర్శి ఆర్ ప్రవీణ్ పరీక్షల అధికారిణి ప్రశాంతి సూచనల మేరకు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నానని ఆయన తెలిపారు. రెండేండ్లలో 200 పాఠశాలల్లో చేతిరాతపై శిక్షణ ఇచ్చారు. ఎజాస్ అహ్మద్  ఆంగ్లభాషలో తయారు చేసిన వీడియోను 40 దేశాల్లో పది కోట్ల మంది వీక్షించారు.  వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర రూ.1 లక్ష నగదు పురస్కారం ఇచ్చారని తెలిపారు.
 

హస్తాక్షరి మనిషి అంత ఃసౌందర్యానికి మనోజ్ఞమైన భాష్యం :  ఎజాస్ అహ్మద్

రాత వ్యాకులతని పోగొట్టే సృజనాత్మకమైన ప్రక్రియ. ముఖాన్ని చూసి భావాన్ని చదవవచ్చు. చేతిరాతను చూసి వ్యక్తి ఆలోచనలు పసిగట్టవచ్చు. కొంత శ్రద్ధ్ద, కొంత శిక్షణ తోడైతే అందమైన చేతిరాత పలకరిస్తుంది.  మనిషి అస్తిత్వాన్ని ప్రతిబింబించే చేతిరాతపై నిర్లక్ష్యం వహించొద్దు. దస్తూరితో మన ప్రవర్తన, ఆలోచనల్ని అంచనా వేసుకోవాలి.  హస్తాక్షరి మనిషి అంతః సౌందర్యానికి మనోజ్ఞమైన భాష్యం అని గట్టిగా నమ్మాను.


logo