సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 19, 2020 , 00:17:13

నేడు ‘పట్నంవారం’

నేడు ‘పట్నంవారం’
  • - భారీగా తరలిరానున్న భక్తజనం
  • - ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ వర్గాలు

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన పట్నం వారానికి భక్తు లు భారీగా తరలిరానున్నారు. ఉత్సవాలు పట్నం వారం మొదలుకొని 10 ఆదివారాలు పాటు కొనసాగనున్నాయి. పట్నంవారం నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కు లు తీర్చుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లతోపాటు గంగరేగు చెట్టు వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే, సేవా టిక్కెట్లు విక్రయించేందుకు రాతిగీరల ప్రాం తంలో నూతనంగా 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. పట్నంవారం సందర్భంగా భక్తులు అదివారం అక్కడే బస చేసి, సోమవారం ఒగ్గు పూజారులు తయారు చేసే పట్నం, అగ్నిగుండాలను దాటుతారు. ఈ మేరకు కల్యాణ వేదిక ప్రాంతంలో ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మల్లన్న క్షేత్రానికి ప్రత్యేక బస్సులు....

ఆలయానికి వచ్చే భక్తులకు రవాణా పరంగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  హైదరబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ నుంచి బస్సు సౌకర్యం ఉంది. అలాగే, హైదరాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లాల నుంచి వచ్చే భక్తులు కొమురవెల్లికి చేరుకోవాలంటే రాజీవ్‌ రహదారిపై ఉన్న కొమురవెల్లి, ఐనాపూర్‌ స్వాగత తోరణాల వద్ద నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైలు మా ర్గంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి జనగామ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జనగామ డిపోలో కొమురవెల్లికి వచ్చేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఉంది. 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

17 మంది ఆలయ ఉద్యోగులతో పాటు అదనంగా 13 మందిని డిప్యూటేషన్‌ ద్వారా నియమించారు. గతంలో 80మంది వలంటీర్ల ఉండగా, ప్రస్తుతం 100 మంది ఉన్నా రు. అగ్నిగుండాల వద్ద భక్తులు ప్రమాదాలకు గురైతే చికిత్స నిమిత్తం ప్రత్యేక వైద్యశిబిరంతోపాటు ఫైరింజన్‌ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. 24గంటల పాటు కరెంట్‌  సరఫరా చేయనున్నారు. ఈసారి క్యూలైన్ల లో నీటి ప్యాకెట్ల సరఫరా, మొబైల్‌ టాయిలెట్స్‌ సిద్ధం చేశారు. 

సెంట్రల్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు

మల్లన్న క్షేత్రంలో సెంట్రల్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ రూంలో పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ, ఆరోగ్య, ఆర్టీసీ, పంచాయతీ శాఖల ముఖ్య అధికారులు  అందుబాటులో ఉంటారు. భక్తుల సమస్యలపై కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ కంట్రోల్‌ రూంలో సిబ్బందిపై పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే, మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌, ఈవో  వెంకటేశ్‌, ఏఈవో సుదర్శన్‌, సభ్యులు అందుబాటులో ఉంటారు.logo