బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 18, 2020 , 00:13:27

‘పట్నంవారం’ పోదాం పదా

 ‘పట్నంవారం’ పోదాం పదా
  • - రేపు మల్లన్న క్షేత్రంలో పట్నం వారం
  • - భారీగా తరలిరానున్న భక్తులు
  • -20న పెద్దపట్నం, అగ్నిగుండాలు
  • - పక్కా ఏర్పాట్లు చేసిన ఆలయ యంత్రాంగం
  • - ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ జోయల్‌ డెవిస్‌

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జునుడి దివ్యక్షేత్రం పట్నం వారానికి ముస్తాబైంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారాన్ని పట్నంవారంగా పిలుస్తారు. మరుసటిరోజు పెద్దపట్నం, అగ్నిగుండాలు  నిర్వహిస్తారు. పట్నం వారానికి హైదరాబాద్‌ నుంచి లక్షలాది భక్తులు తరలిరానుండడంతో ఆలయ కమిటీ పక్కా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా త్వరగా దర్శనమయ్యేలా ప్రత్యేక క్యూలైన్లతోపాటు తాగునీటి వసతి, పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. పట్నంవారానికి వచ్చిన భక్తులు మరుసటిరోజు పెద్దపట్నం,అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10 వారాలపాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నామని ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌ తెలిపారు.

చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఉత్సవాలకు సిద్ధ్దమైంది. భక్తుల పాలిట కొంగుబంగారంగా మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతున్నంది. గత డిసెంబర్‌ 22వ తేదీన నిర్వహించిన మల్లన్న కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పర్వదినం పూర్తి అయిన తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో  స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌వారం, మహా శివరాత్రిన నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలు కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాల సందర్భంగా ఆలయం, రాజగోపురం, గదులకు రంగులను వేయించడంతో  మల్లన్న క్షేత్రం సుందరంగా మారింది. ఈ నెల 19న నిర్వహించే పట్నంవారంతో ఉత్సవాలు ప్రారం భమవుతుండడంతో బ్రహ్మోత్సవాల సమయం లో 10వ ఆదివారంతోపాటు, ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్య లో తరలి రానున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామిని దర్శించుకునేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్యూలైన్లలో నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే, విశిష్ట దర్శనం, శీఘ్రదర్శనం, ధర్మ దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతోపాటు స్వామివారిని దర్శించుకున్న ఆనంతరం బయటకు వెళ్లే దారిలో ఏర్పాట్లు చేశారు.

పట్నం వారానికి హైదరాబాద్‌ భక్తులు

పట్నం వారం సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. దీనికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపట్టి, పట్నం వారంలో స్వామిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు.

అమ్మవార్లకు బోనాలతో మొక్కులు

ఈ నెల 20న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న ఆలయవర్గాల సహాకారంతో హైదరాబాద్‌కు చెందిన ఒగ్గు పూజారులు పట్నం వేయడంతో పాటు అగ్నిగుండం తయారు చేసి దానిని దాటుతారు. ఈ మేరకు ఆలయంలోని శాశ్వత కల్యాణ వేదిక ముందు ప్రత్యేకంగా అగ్నిగుండం, పెద్దపట్నం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఆనం తరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.


ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మల్లన్న స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌ తెలిపారు. ఆలయంలో ఈవో వెంకటేశ్‌తో కలిసి ఆయన సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
 
పట్నం వారం మొదలుకొని 10 వారాల పాటు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో సకల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ రాజగోపురం నుంచి ఎల్లమ్మ అమ్మవారి కమాన్‌ వరకు 3క్యూలైన్లు షెడ్స్‌తో నిర్మించినట్లు తెలిపారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీరు అందించేందుకు నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, దాతల సహాకారంతో నూతనంగా ఆరు గదులను నిర్మించి, ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు. కల్యాణ మండపం వద్ద పవిత్రత కాపాడేందుకు ప్రహరీ నిర్మించామని, ప్రముఖులు, దాతల కోసం ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలోకి సెల్‌ ఫోన్లు తీసుకునిరాకుండా నిషేధించినట్లు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు ప్రైవేట్‌ సెక్యురిటీ అందుబాటులో ఉం టారని, వృద్ధులు, వికలాంగులకు లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్నం వేసే భక్తులు ధర్మదర్శనంలోకి ప్రవేశించకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే, ఎల్లమ్మ ఆలయ మహామండప పనులను పూర్తి చేస్తా మన్నారు. సమావేశంలో ఏఈవో సుదర్శన్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి పాల్గొన్నారు.

భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి

మల్లికార్జున స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తుల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ సూచించారు. పట్నం వారం, చిన్నపట్నం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన అధికారులు, సిబ్బందితో మల్ల న్న క్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మల్లన్న మొదటి వారం సందర్భంగా 3 ఏసీపీ, 12 మంది సీఐ, 25 మంది ఎస్‌ఐ, 30 మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 160 మంది  కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, బీడీ టీమ్స్‌, రోప్‌ పార్టీలతో మొత్తం 318 మందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బందికి కేటాయించిన డ్యూటీలో శనివారం ఉదయం 5 గంటల కు హాజరుకావాలని, భక్తులతో క్రమశిక్షణతో మంచి మాట్లాడాలని, దురుసుగా ప్రవర్తించవద్దన్నారు. పార్కింగ్‌ స్థ్ధలాల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్‌ చేయించాలని, ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బందోబస్తును సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసుశాఖ సూచనలను పాటించి, సహకరించాలని కోరారు. సమావేశంలో చేర్యాల సీఐ రఘు, సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌, కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo