మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 18, 2020 , 00:12:51

గోదావరి జలాలతో రైతన్న పాదాలు కడిగాం

గోదావరి జలాలతో రైతన్న పాదాలు కడిగాం


చేర్యాల, నమస్తే తెలంగాణ : ‘చేర్యాలకు గోదావరి జలాలు తెచ్చి, రైతన్న పాదాలు కడిగాం.. చెరువులు నిండుకుండలా మారడంతో ఇవాళ రైతన్నలు రెండు పంటలు పండించుకుంటున్నారు’.. అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. చేర్యాల ప్రాంతాభివృద్ధి పై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా రైతులు రెండు పంటలు పండించుకునేందుకు అన్ని చెరువుల్లోకి గోదావరి జలాలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2014లో రూ.17కోట్ల విలువైన ధాన్యాన్ని రైతులు విక్రయిస్తే, ఇప్పుడు రూ.300 కోట్ల విలువైన ధాన్యం విక్రయించి రికార్డు సాధించారన్నారు. చేర్యాల పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, సీఎం కేసీఆర్‌ మదిలో చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు యోచన ఉందన్నారు. చేర్యాల చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసి రోడ్డుకు ఇరువైపు పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ ప్రాంత రైతులకు వసతులు కలుగడంతో పాటు చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని, బల్దియాలోని 12 వార్డులను తప్పక క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పల్లెప్రగతితో పాటు పట్టణ ప్రగతిని మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం నిర్వహించేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేరని, ఏదో నామ్‌కే వాస్తే పోటీలు చేస్తున్నారని, ప్రజలకు అన్ని విధాలుగా మంచి చేస్తున్న టీఆర్‌ఎస్‌ను మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆదరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండలి చీఫ్‌ విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, చేర్యాల మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి గుజ్జ సంపత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మండలాల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మంద యాదగిరి, యూత్‌ మండల మాజీ అధ్యక్షుడు శివగారి అంజయ్య, సీనియర్‌ నాయకుడు ఆడెపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.logo