బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 14, 2020 , 03:48:14

ప్రగతి అదిరింది

ప్రగతి అదిరింది

పల్లెలు కొత్తందాలు సంతరించుకున్నాయి.. సంక్రాంతికి ఊళ్లన్నీ శుభ్రమయ్యాయి.. చెత్తాచెదారమంతా డంపింగ్‌యార్డులకు తరలింది.. పిచ్చిమొక్కలు లేకుండా పోయాయి. మురుగుకాల్వలన్నీ సాఫీగా  పారుతున్నాయి. శ్రమదానాలతో ప్రజలు గ్రామాలను బాగుచేసుకున్నారు. పల్లెలు పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లెప్రగతి పనులు జిల్లాలో విజయవంతమయ్యాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ఉద్యమతరహాలో పనులు జరిగాయి. గ్రామానికో ప్రత్యేకాధికారి ఉండడం, ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయడంతో అనుకున్న దానికన్నా పనులు ఎక్కువగానే జరిగాయి. అన్ని గ్రామాల్లో 2,220 కి.మీ మేర రోడ్లు, 1,065 కి.మీ మురుగుకాల్వలను శుభ్రం చేశారు. 299 పాతబావులు, 77 నిరుపయోగ బోరుబావులను పూడ్చివేశారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు 899 అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేసి రంగులు వేయడంతో నూతన శోభ సంతరించుకున్నది. ప్రతి ఇంటికి రెండు చొప్పున 59,248 చెత్తబుట్టలను పంపిణీ చేశారు. విద్యుత్తు శాఖ సిబ్బంది వదులు వైర్లను సరిచేయడంతో పాటు నూతన కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణానికి భూమిపూజలు చేయగా కొన్నిచోట్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతిలో పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగకు పల్లెలు ముస్తాబయ్యాయి. రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో అద్భుత గ్రామాలుగా తీర్చిదిద్దబడ్డాయి. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండవ విడుత విజయవంతమైంది. గ్రామాల్లో శ్రమదానాలు, మురికి కాల్వల శుభ్రం, తడి-పొడి చెత్త వేరు చేసే విధానం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, వీధిలైట్ల ఏర్పాటు తదితర పనులను చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 


సిద్దిపేట జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం పది రోజుల పాటు జోరుగా కొనసాగింది. సంక్రాంతి పండుగకు పల్లెలన్నీ ముస్తాబయ్యాయి. జిల్లాలోని 23 మండలాల్లో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పల్లె ప్రగతి ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించి గ్రామాలను ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఈ పాదయాత్రలో 27,740 మంది పాల్గొన్నారు. గ్రామాల్లోని 2,220 కి.మీ. మేర రోడ్లను, 1,065 కి.మీ. మురికి కాల్వలను శుభ్రం చేశారు. 8,484 చెట్ల పొదల ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించారు. 299 పాత బావులను, 77 నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చి వేశారు. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేశారు. జిల్లాలో 899 అంగన్‌వాడీ సెంటర్లను శుభ్రం చేసి రంగులు వేశారు. 513 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 215 ఉన్నత పాఠశాలల శుభ్రం చేశారు. కొన్ని పాఠశాలలకు రంగులు వేశారు. జిల్లాలోని 195 దవాఖానలు, 842 కమ్యూనిటీ భవనాలను శుభ్రం చేశారు. జిల్లాలో 1,40,884 హౌస్‌ హోల్డర్స్‌ను గుర్తించి ప్రతి ఇంటికి రెండు చొప్పున 59,248 చెత్త బుట్టలను పంపిణీ చేశారు. పల్లెల్లో ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానాలు చేశారు. 499 గ్రామ పంచాయతీల్లో శ్రమదానాలు నిర్వహించగా 24,923 మంది పాల్గొన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ శాఖ సిబ్బంది లూజ్‌ వైర్లను సరిచేశారు. తడి-పొడి చెత్తలో భాగంగా 1,54,851 ఇండ్ల నుంచి చెత్తను సేకరించారు. 69,379 విద్యుత్‌ దీపాలను బిగించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆయా  గ్రామాల్లో ముందుకు వచ్చిన వారి నుంచి విరాళాలు సేకరించారు.  


ప్లాస్టిక్‌ రహిత గ్రామాలే లక్ష్యం... 

ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ కలెక్షన్‌ యూనిట్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ను అందులో వేయిస్తున్నారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. కిలో ప్లాస్టిక్‌ తీసుకవస్తే అందుకు బదులుగా కిలో బియ్యం లేదా చక్కెర తదితర వస్తువులను అందిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని గ్రామాల్లో జూట్‌ బ్యాగులను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని కిరాణ షాపుల్లో బట్ట సంచులను వాడాలని చెబుతూ స్వయంగా కొంత మంది సర్పంచులు జూట్‌ బ్యాగులు అందిస్తున్నారు.logo