మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 13, 2020 , 01:28:48

సంక్రాంతి సందడి..

సంక్రాంతి సందడి..
  • -రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి, 16న కనుమ
  • -ఊరూరా పండుగ వాతావరణం
  • -కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల రాక ప్రారంభం
  • -హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు
  • -ఇంటి వాకిట ముత్యాల ముగ్గులు, పిల్లల పతంగులు

చేర్యాల, నమస్తే తెలంగాణ: భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఈ నెల 14వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు తెలుగు లోగిల్లో సందడి చేయనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలన్నీ సంక్రాంతి సంబురాల్లో ఉర్రూతలూగనున్నాయి. ఇంటి ముంగిట ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, పిల్లల గాలిపటాల ఎగురవేతలు ఇలా వివిధ రకాల ఆటలతో సందడి కానుంది. ఆడపడుచులు తమ తమ వాకిళ్లలో ముత్యాల ముగ్గులు వేసి రంగులతో నింపి చూడముచ్చటగా  అలంకరించనున్నారు. మూడు రోజులు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ ఎంతో ప్రత్యేకతను చోటు చేసుకుంది. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగను జరుపుకోవడానికి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. 

భోగి పండుగతో ప్రారంభం...

పండుగలు సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకలు. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకత సంతరించుకోనున్నది. అందులో భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. పాత వస్తువులను భోగి మంటల్లో  వేసి చెడును పారద్రోలి మంచిని ఆస్వాదించడం భోగి పండుగ  యొక్క విశిష్ఠత. ఆడ పడుచులు కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందు వాకిళ్లలో రంగు రంగుల రంగవల్లులు వేస్తారు. దీంతో ఆడపడుచులు వేసిన ముత్యాల ముగ్గులు ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. ఉదయంనే పాలు పొంగించి, ఇంటి ముంగిట గొబ్బెమ్మలు పెట్టి నవ ధాన్యాలు పోస్తారు. రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువు పాకల వద్ద సైతం గొబ్బెమ్మలను పెడతారు. సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ భోగి. భోగి పండ్లంటే రేగు పండ్లు. వీటిని సూర్యుడు ఇష్టంగా ఆరగిస్తాడని ప్రతీతి.

సంక్రాంతి...

సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేశాధి, ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి  ప్రవేశించడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. హేమంత రుతువులో చల్లటి గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సమయంలో మకర సంక్రాంతికి ప్రాధాన్యత సంతరించుకుంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడుతాడు. అందుకే స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ కాలంలో చేయు దానాలు చాలా గొప్పవని చెబుతారు. ముఖ్యంగా ధాన్యం, ఫలాలు, కాయగూరలు తదితర వాటిని దానం చేయడంలో పుణ్యం వస్తుందని చెబుతారు.

ఇంటింటా పిండి వంటలు...

సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు చేస్తారు.ప్రత్యేకమైన పిండితో వివిధ వంటకాలను చేస్తారు. ఈ పండుగకు సకినాలు స్పెషల్‌. బియ్యం, పిండి, ఓమ, ఉప్పుతో కలిపి సకినాలు తయారు చేస్తారు. గారెలు, పూసబిల్లలు, అరిసెలు ఇలా పిండితో తయారు చేసే వంటకాలను ఇంటింటా చేస్తారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా భోజనాలు చేసుకొని తింటారు. కొత్త అల్లుళ్లు, బంధు మిత్రుల కలయికతో సరదాగా మూడు రోజులు గడుపుతారు.

 

డూ ..డూ..బసవన్న

తెల్లవారక ముందే గంగిరెద్దుల వారు డూ...డూ...బసవన్న అంటూ ఇంటి ముంగిట్లో ఉంటారు. అయ్యవారికి దండం పెట్టు...అమ్మ గారికి దండం పెట్టు అంటూ వారి కుల వృత్తులను ప్రదర్శిస్తారు. డోలు తిప్పుతూ, సన్నాయి పాటలతో గంగిరెద్దుల నృత్యాలతో ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కుంటారు. ఇంటి యజమాని నిద్ర లేచే వరకు తన డోలు(గంట)తో శబ్దం చేస్తూనే ఉంటాడు. ఇలా శబ్దంకు ఇంటి యజమాని నిద్ర లేచి దానం చేయడంతో అక్కడి నుండి మరో ఇంటికి పయనం అవుతాడు.

 పిల్లల గాలి పటాలు..

పిల్లలకు సెలవులు వచ్చాయంటే మహా సరదా. దసరా తర్వాత అత్యధికంగా సెలవులు వచ్చే పండుగ సంక్రాంతి. దాదాపుగా ఏడు రోజులు సెలవులు రావడంతో పిల్లలంతా తమ తమ అమ్మమ్మ వాళ్ళ ఇండ్లలోకి వెళ్లి సరదా చేస్తారు. పట్టణాలలో ఉన్న వారంతా పల్లెలకు వస్తారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే వారంతా గాలి పటాలను ఎగుర వేస్తూ మహా సరదాను చేస్తారు. రంగు రంగులా గాలి పటాలను ఒకరి కన్నా ఒకరు ఎక్కువగా ఎగుర వేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు.

 

హరిదాసు కీర్తనలు

సంక్రాంతి పండుగ రోజు హరిదాసుల కీర్తనలతో పల్లెలన్నీ మార్మోగుతాయి. హరిలో రంగ హరి అంటూ వాయిద్యం వాయిస్తూ హరిదాసులు గ్రామాల్లో దర్శనం ఇస్తుంటారు. హరిదాసు వేషధారణ సైతం చూడ ముచ్చటగా ఉంటుంది. నడి నెత్తిపై చెంబు, తిరుమణి పట్టెలతో, కంచు, గజ్జెలు కట్టుకుని గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఇంటి ముంగిట వాలుతారు. చేతితో చిడుతలు కొడుతూ హరిదాసు చేసే కీర్తనలు భలేగా ఉంటాయి.

 ఇంటి ముంగిట గొబ్బెమ్మలు

ఇంటి ముంగిట్లో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బెమ్మలతో పాటు తొమ్మిది రకాలకు చెందిన ధాన్యంను పోస్తారు. గొబ్బెమ్మకు గరక పోస, గడ్డి పువ్వు, పసుపు, కుంకుమలు పెట్టి అందంగా తయారు చేస్తారు. పండుగ మూడు రోజులలో ఇంటి ముంగిట వాకిళ్లలో, పశువుల పాక వద్ద ప్రత్యేకంగా పెడతారు.

సంక్రాంతి నోములు, వ్రతాలు

సంక్రాంతి పండుగకు వైవిధ్య నోములు, వ్రతాలు జరుపుకుంటారు. చక్కెరను కరగబోసి వైవిధ్య ఆకృతుల్లో రూపొందించే నోముల్లో రేగు పండ్లు, జీడిపండ్లు, పసుపు, కుంకుమలతో నువ్వులు, పసుపుతో తయారు చేసిన గౌరీదేవతామూర్తిని కొలుస్తారు. వీటి ముందు వివిధ రకాల లోహాలు, ప్లాస్టిక్‌ ఆహార తదితర సామగ్రితో తయారు చేసిన 13 సంఖ్య గల సామగ్రిని ఒక నోముగా పరిగణిస్తారు. వీటిని మహిళలు పూజించి ఇతర మహిళలకు అందిస్తారు. సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ముద్దలను దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం తెలుపుతుంది.

 కాటిరావలు

రైతులు కాటిరావల పండుగను ప్రత్యేకంగా చేస్తారు. తమ తమ పశువుల పాక వద్ద ఈ పండుగను చేస్తారు. తమ పశువులను శుభ్రంగా కడిగి పశువుల కొమ్ములకు జాజును పూసి అందంగా అలంకరిస్తారు. పరమాన్నంను ప్రత్యేకంగా తయారు చేసి సాయంత్రం వేళలో రైతులంతా తమ దొడ్ల వద్ద జమ అవుతారు. వండిన వేడి వేడి పరమాన్నంను రైతులు పశువుల చుట్టూ తిరుగుతూ వేస్తారు. ఇష్ట దైవంకు నైవేథ్యంను సమర్పించిన అనంతరం కోళ్లు, మేకలను కొసుకొని కాటిరావల పండుగను జరుపుతారు. గొడ్డు, గోదా చల్లంగా ఉండాలని మొక్కుకుంటారు. ఇలా మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ సంబరాలను జిల్లా ప్రజలు జరుపుకుంటారు.

మార్కెట్లు కళకళ

సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. జీడి, రేగు పండ్లు, పిడుకలు, ఆవు పేడ, గొబ్బెమ్మలు, వివిధ రకాల రంగులు, మట్టి పాత్రలు, గరిక, బంతిపూలను విక్రయిస్తున్నారు. వివిధ రకాల గాలిపటాలు, చక్రీలు, దారాలు భారీగా విక్రయిస్తున్నారు.


logo