ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 12, 2020 , 00:14:27

రెండు తిరస్కరణ.. మూడు తొలగింపు

 రెండు తిరస్కరణ.. మూడు తొలగింపు
  • హుస్నాబాద్‌లో నామినేషన్ల పరిశీలన ముగింపు

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. వార్డుల వారీగా నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. స్క్రూట్నీ అనంతరం ఇద్దరు అభ్యర్థులకు చెందిన నామినేషన్లను తిరస్కరించడంతో పాటు మరో మూడు అదనపు నామినేషన్లను తొలగించారు. 12వ వార్డులో రాజు అనే వ్యక్తి వేసిన నామినేషన్‌తో పాటు 14వ వార్డులో ప్రేమ్‌కుమార్‌ వేసిన నామినేషన్‌ను వివిధ కారణాలతో తొలగించారు. మొత్తం 179నామినేషన్లు దాఖలు కాగా, ఇందులోంచి ఐదు నామినేషన్లు పోనూ ప్రస్తుతం 115మంది వేసిన 174నామినేషన్లున్నాయి. తొలగించబడిన నామినేషన్లపై ఆది, సోమవారాల్లో అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ నుంచి 69నామినేషన్లు ఉండగా బీజేపీ నుంచి 37, కాంగ్రెస్‌ నుంచి 35, సీపీఐ నుంచి 5, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్లు 26 నామినేషన్లు ఉన్నాయి. అంతకు ముందు నామినేషన్ల పరిశీలన కోసం వచ్చిన అభ్యర్థులకు ఆర్డీవో జయచంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. అభ్యంతరాలు ఉంటే పరిశీలన సమయంలోనే చెప్పాలని, అధికారులు నిబంధనల ప్రకారమే నామినేషన్ల ప్రక్రియ చేస్తున్నందున అభ్యర్థులు సహకరించాలని కోరారు.


logo