బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 09, 2020 , 18:53:24

19 నుంచి పల్స్‌ పోలియో

19 నుంచి పల్స్‌ పోలియో

-ఈ నెల 21 వరకు చుక్కల కార్యక్రమం
-జిల్లావ్యాప్తంగా ఐదేండ్లలోపు చిన్నారులు 78857 మంది
-జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ వెల్లడి

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ నెల 19 నుంచి 21 వరకు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేసీ పద్మాకర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జేసీ పద్మాకర్‌ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొదటగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జిల్లాలోని అందరు సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు విధిగా పాల్గొనాలన్నారు. జిల్లా వి ద్యాశాఖ అధికారి, మండల స్థాయిలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొనాలని, పల్స్‌పోలియో కార్యక్రమానికి పాఠశాల భవనాలు కేటాయించాలన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు ఈ నెల 16 నుంచి 21 వరకు పవర్‌ సైప్లె చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. అదే విధంగా అన్ని మహిళా సంఘాలు 0-5 సంవత్సరాల బాల బాలికలకు పోలియో చుక్కలు వేయించేలా చూడాలన్నారు. అ న్ని బస్టాండ్లలోను పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించాలని, బస్సులకు బ్యానర్లు కట్టాలన్నారు.

అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమం, పల్స్‌పోలియో మానిటరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీలు సిద్దిపేట మినహా దుబ్బాక, గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌లలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున అధికారులు మాత్రమే కార్యక్రమంలో సమావేశాలు, ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవాల్సిందిగా డీఆర్‌వో చంద్రశేఖర్‌ను ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో రేపు పల్స్‌పోలి యో పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 78,857 మంది 0-5 సంవత్సరాల్లోపు పిల్లలు ఉండగా, 628 హైరిస్క్‌ ఏరియాల్లో 1316 మంది పిల్లలున్నారన్నారు. మొత్తం 711 బూత్‌లు, 19 ట్రాన్సిట్‌ పాయింట్లు, 77 రూట్‌ సూపర్‌వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీలకు చెందిన 2,844 మంది సిబ్బంది, 5 వేల పోలియో వాయిల్స్‌ను వాడుతున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఈ నెల 13న అన్ని ప్రాథమిక కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మనోహర్‌, వైద్యులు కాశీనాథ్‌, శ్రీదేవి, రజిని, మల్లీశ్వరి, పవన్‌, అధికారులు రమేశ్‌బాబు, రామ్మోహన్‌రెడ్డి, నర్సింహ, పీటర్సన్‌, మదన్‌మోహన్‌, ఏసుమేరీ తదితరులు పాల్గొన్నారు.


logo