శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:24:09

పతంగుల ఫన్‌డుగ

పతంగుల ఫన్‌డుగ

సిద్దిపేట టౌన్‌ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ప్రతి గ్రామంలో మహిళలు తమ ఇంటి ఎదుట రంగురంగులతో అందమైన ముగ్గులు వేయగా.. యువత, చిన్నారులు, పెద్దలు పతంగుల ఎగురవేతతో సందడి చేశారు. సంక్రాంతి సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తూ పతంగులను ఎగురవేస్తూ సంతోషంగా గడు పుతున్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటతోపాటు గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాలతోపాటు మండల కేంద్రా ల్లో అందరినీ ఆకట్టుకునేలా దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. విని యోగదారులకు ఇష్టమైన ఆకృతుల్లోని పతంగులను దుకాణదారులు అందుబాటులో ఉం చారు. యువత, చిన్నారులు పతంగులను, చెరక మాంజా కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. 

 రూ.5 నుంచి 100 వరకు పతంగులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువతను ఆకట్టుకునేందుకు దుకాణదారులు ప్రత్యేకంగా పతంగులను హైదరాబాద్‌, ముంబాయి నుంచి తీసుకవచ్చారు. రూ.5 నుంచి 100 పతంగులను విక్రయించారు. ప్రధానంగా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు విభిన్న ఆకృతుల పతంగులను తీసుకవచ్చారు. సిద్దిపేటలో మాంజా తయారీ కేం ద్రానికి అడ్డాగా ఉంది. రాజన్న మాంజా, వంశీ తదితర పేర్లతో కూడిన మాంజాలకు మంచి గిరాకీ ఉంది. పండుగ సందర్భంగా ప్రత్యేక మాంజాను తయారు చేసి విక్రయించారు. రూ.100 విలువైన  పతంగులు విశేషంగా అమ్ముడయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజాను పూర్తిగా నిషేధించింది. వ్యాపారస్తులు లోకల్‌ మాంజా విక్రయిస్తున్నారు.  

విభిన్న ఆకృతుల్లో పతంగులు  

కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారస్తులు పోటాపోటీగా విభిన్న ఆకృతుల పతంగులను తీసుకవచ్చి విక్రయాలు జరిపారు. పక్షి, చోటాభీమ్‌, మిక్కీ మౌస్‌, మోటు పట్లు, ఉక్రేబాయిస్‌, స్పైడర్‌ మ్యాన్‌తో పాటు స్పూర్తిదాయకమైన  బేటీ పడావ్‌ బేటీ బచావ్‌ కొటేషన్‌తో కూడిన పతంగులను విక్రయించారు. 

 సంక్రాంతి సందడి 

ప్రజలు సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. మహిళలు ముగ్గులు వేయడానికి వివిధ రంగులను కొనుగోలు చేశారు. భోగి పండుగ పురస్కరించుకొని ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, నవధాన్యాలను అలంకరించారు. అలాగే, భోగి మంటలు వేసి తమకు భోగి భోగభాగ్యాలు చేకూరాలని వేడుకున్నారు. 


logo