e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మెదక్ అద్భుత ఆదరణ

అద్భుత ఆదరణ

  • సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో 1061 ఎకరాల్లో మొక్కలు నాటిన రైతులు
  • దసరా తర్వాత రెండో విడతకు ఏర్పాట్లు
  • వచ్చే ఏడాది 7వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
  • జిల్లా నుంచే మొక్కల సరఫరా..
  • ములుగు, రంగనాయకసాగర్‌ వద్ద రెండు నర్సరీలు
  • సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న సర్కారు

సిద్దిపేట, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆయిల్‌పాం(పామాయిల్‌) సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ జిల్లాలో మొత్తం 50వేల ఎకరాలు సాగు చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు 2,005 మంది రైతులకు సంబంధించిన 5,151 ఎకరాలను సాగుకు అనుకూలంగా అధికారులు గుర్తించారు. తొలిదశలో 1,061 ఎకరాల్లో 178 మందికి పైగా రైతులు ఇప్పటికే సాగుచేశారు. కాగా, రెండోదశలో దసరా తర్వాత మరో 2వేల ఎకరాల్లో సాగుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండో విడుత సాగుకోసం రైతులు కావాల్సిన ఆయిల్‌పాం మొక్కల కోసం డీడీలు కట్టి సిద్ధంగా ఉన్నారు. తొలిసారి కావడంతో మొక్కలు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యమవుతున్నది. భవిష్యత్‌లో ఆయిల్‌పాం మొక్కలకు ఇబ్బందులు రాకుండా జిల్లాలోని ములుగు ఫారెస్ట్‌లో, రంగనాయక సాగర్‌ వద్ద రెండుచోట్ల ఆయిల్‌ పాం మొక్కల నర్సరీలను ఏర్పాటు చేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు నర్సరీల్లో జిల్లాకు సరిపడా మొక్కలు పెంచనున్నారు. వచ్చే ఏడాది మరో 7 వేల మొక్కలు నాటనున్నారు. ఆయిల్‌పాం సాగుకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉంది.

నంగునూరు మండలం నుంచి మొదలు..
అనుకూల వాతావరణం ఉండడంతో సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌ పాం సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో తొలుత నంగునూరు మండలంలో ఆయిల్‌పాం సాగుకు మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. సాగుచేసే వారికి ఏ సహకారం కావాలన్నా, తాను అందిస్తానని రైతులకు మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. దీంతో రైతులు ముందుకు వస్తున్నారు. అయితే స్థానికంగా ఆయిల్‌పాం మొక్కల కొరత వేధిస్తున్నది. దసరా తర్వాత రెండో విడతలో నాటేందుకు కావాల్సిన మొక్కలను ఉద్యానశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. మిగతా గ్రామాల రైతులను ప్రోత్సహించి, ఆ గ్రామాల్లో ముందుకొచ్చే రైతులతో ఆయిల్‌ పాం మొక్కలు నాటించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన జడ్పీ సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సభకు ఈ విషయాన్ని తెలియజేశారు. అన్ని గ్రామాల రైతులు ఆయిల్‌పాం సాగుచేసేలా ప్రతీ రైతును ప్రోత్సహించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని చెప్పారు.

- Advertisement -

సాగుతో లాభాలు..
ఆయిల్‌పాం ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వచ్చి, 30 ఏండ్ల వరకు రైతుకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇటు రైతుకు, అటు పర్యావరణానికి మేలు కలిగించేదిగా ఈ పంట పేరుగాంచింది. ఈ పంటలకు చీడ పురుగులు, కోతులు, రాళ్లవాన ఉండదు. రైతులు పండించిన పంటలను కేటాయించిన పామాయిల్‌ కంపెనీలు వచ్చి కొనుగోలు చేస్తాయి. రైతు ప్రతి నెలనెలా లాభదాయక ఆదాయం పొందవచ్చు. పామాయిల్‌ను మన దేశంలో అధికంగా బేకరీ ఉత్పత్తుల తయారీ, గృహ అవసరాలకు వినియోగిస్తారు. దీని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులతో బయోడీజిల్‌, మల్చింగ్‌కు ఉపయోగపడుతాయి. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల పామాయిల్‌ తోటను సాగుచేయవచ్చు. పంట వేసిన నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి 10-12 టన్నుల ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడితో, సుమారు రూ. లక్ష పైచిలుకు ఆదాయం 30 ఏండ్ల వరకు నిరంతరంగా వస్తుంది. ఆయా ప్రాంతాలకు కేటాయించిన కంపెనీల ద్వారా మొక్కలు, మొదటి నాలుగేండ్లు ఎరువులు సరఫరా చేస్తారు. దిగుబడి సమయంలో ప్రభుత్వం నిర్ణయించబడిన ధర ప్రకారం కంపెనీలతో గెలలు కొని, రైతుల ఖాతాలో పక్షం రోజులకోసారి డబ్బులు జమచేస్తారు. ప్రస్తుతం ఆయిల్‌పాం టన్ను ధర రూ.16,717 ఉంది. గత నెలలో దీని ధర టన్నుకు రూ.16,415 ఉండేది. రెండు రోజుల కిందట దీని ధరను ఆయిల్‌ రికవరీ, విక్రయాలను అంచనా వేసి ఈ నెలలో రూ.302 ఆయిల్‌ ఫెడ్‌ పెంచింది.

నర్మెటలో ఆయిల్‌పాం పరిశ్రమ..
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెటలో ఆయిల్‌పాం పరిశ్రమ ఏర్పాటు కాను న్నది. ఇందుకు కావాల్సిన 105 ఎకరాల స్థలా న్ని సైతం సేకరించారు. జిల్లాలో సాగుకోసం ‘3ఎఫ్‌ ఆయిల్‌పాం ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఆయిల్‌పాం సాగులో ప్రాసెసింగ్‌ అనుభవం, పెట్టుబడి సామర్థ్యం గల కంపెనీలకు ప్రాధాన్యమిచ్చారు.

1,061 ఎకరాల్లో సాగు…
సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో 19 మండలాల్లో సుమారుగా 178మంది రైతులు 1,061 ఎకరాల ఆయిల్‌పాం తోటలు సాగుచేశారు. మొత్తం డ్రిప్‌ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 700 ఎకరాలు తోటలు వేశారు.

ప్రభుత్వ ప్రోత్సాహం
ఆయిల్‌పాం సాగుకు గుంతలు తీయడం, మొక్కలు, ఎరువులు తదితర వాటికి గానూ ఉపాధిహామీ పథకంలో రూ.56,283, ఉద్యానవనశాఖ ద్వారా 24,800ను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నది. ఇందులో ఎకరాకు ఉపాధిహామీ పథకంలో 168 పనిదినాలకు గానూ కూలీల వేతనాలకు రూ. 41,236, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.15,047, మొత్తం రూ.56,283 అందిస్తున్నది. ఇక ఉద్యానశాఖ తరఫున ఎకరానికి మొదటి సంవత్సరం మొక్కలకు రూ.8,800, ఎరువులకు రూ.2వేలు, అంతర పంటకు రూ.2వేలు మొత్తం రూ.12,800 ఇస్తున్నది. రెండో, మూడో, నాల్గో సంవత్సరాలకు గానూ మొక్కలకు గాకుండా ఒక్కో సంవత్సరానికి రూ.2 వేల చొప్పున ఎరువులకు, అంతర పంటలకు వేర్వేరుగా అందిస్తారు. ఈ లెక్కన రెండో సంవత్సరం రూ.4 వేలు, మూడో ఏడాది రూ.4వేలు, నాల్గో ఏడాది రూ. 4వేలు మొత్తం నాలుగేండ్లకు గాను రూ. 24,800ను అందిస్తుంది. ఉపాధిహామీ, ఉద్యాన శాఖలు కలిపి ఎకరానికి రైతుకు సబ్సిడీ కింద రూ.81,083 అందిస్తాయి.

వరి కంటే ఆయిల్‌పాం బెటర్‌
ఏ పంట వేసిన రైతుకు లాభం లేకుండా పోతుంది. పెట్టుబడి ఖర్చులు కూడా వస్తలేవు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలేస్తే రైతులకు ఏం మిగులతలేవు. సర్కారు చెప్పినట్లు ఏడున్నర ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలను పెట్టిన. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు వెళ్లి అక్కడ రైతులు సాగు చేసిన ఆయిల్‌పాం పంటను చూసిన. ఎకరానికి రూ.25వేలు వస్తాయి. ఆయిల్‌పాం తోటలో అంతర పంటగా పత్తి పంటను సాగు చేసిన. సర్కారు ఆయిల్‌పామ్‌కు వంద శాతం సబ్సిడీ ఇస్తుండడంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా మండలంలో మొదటిసారిగా నేను వేశాను.

రైతులు ముందుకొస్తున్నారు..
జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయిల్‌పాం తోటలు సాగుచేశారు. రెండో విడత దసరా తర్వాత సాగు చేస్తాం. రెండో విడత పంట సాగుకు రైతులు డీడీలు కట్టారు. ములుగు, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద ఆయిల్‌పాం మొక్కల పెంపకానికి రెండు నర్సరీలు ఏర్పాటు చేశాం. జిల్లాకు సరిపడా మొక్కలు ఇక్కడి నుంచి అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. గ్రామాల వారీగా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana