శుక్రవారం 07 ఆగస్టు 2020
Science-technology - Jul 05, 2020 , 21:48:41

జూమ్‌కు ప్రత్యామ్నాయం: చివరి దశలో హైదరాబాద్ సంస్థలు

జూమ్‌కు ప్రత్యామ్నాయం: చివరి దశలో హైదరాబాద్ సంస్థలు

హైదరాబాద్: జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయం సాధించే పోటీలో హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు విజయం సాధించాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో చివరి దశకు చేరుకున్నాయి. జోహో కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి పెద్ద సంస్థలను ఓడించిన ఈ రెండు కంపెనీలు త్వరలో స్వదేశీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ టెక్నాలజీని మన ముంగిటకు తీసుకురానున్నారు.

పీపుల్‌లింక్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సోల్‌పేజ్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో చివరి దశకు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ రెండు కంపెనీలకు వరుసగా రూ.20 లక్షలు, రూ.15 లక్షలు బహుమతిగా అందనున్నాయి. పీపుల్‌లింక్ ప్లాట్‌ఫారమ్‌ను ఇన్‌స్టావిసి అని పిలుస్తారు. సోల్‌పేజ్ యొక్క వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం లిబెరో. జూమ్ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 10 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో జోహో కార్పొరేషన్ (చెన్నై), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (నోయిడా), అరియా టెలికాం (ఘజియాబాద్), ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌లాబ్స్ (చెన్నై), డేటా ఇంజినియస్ గ్లోబల్ లిమిటెడ్ (జైపూర్), సర్వ్ వెబ్స్ (జైపూర్), టెక్జెన్సియా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (అలప్పుజ) ఉన్నాయి.

వీటిలో సర్వ్ వెబ్స్, టెక్జెన్షియా సాఫ్ట్‌వేర్ పీపుల్‌లింక్‌తోపాటు మొదటి మూడు కంపెనీలలో భాగంగా రూ.20 లక్షలు అందుతాయి. సోల్‌పేజీతో పాటు ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌లాబ్‌లు కూడా ఎంపికయ్యాయి. టెక్నాలజీని ఉత్పత్తి, అభివృద్ధి చేయడానికి వీరికి రూ.15 లక్షలు అందుతాయి.

"భారతదేశం తయారుచేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మా వేదిక తొలి ఐదు స్థానాల్లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ధ్రువీకరణ అందింది. టాప్ 5 కంపెనీలలో ఒకటిగా ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేస్తాం ”అని సోల్‌పేజ్ ఐటీ సొల్యూషన్స్ సహావ్యవస్థాపకుడు రమేశ్‌ దమ్మా తెలిపారు. 12 సంవత్సరాలుగా వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యాపారంలో ఉన్న పీపుల్‌లింక్, ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతమున్న లక్షణాలను అభివృద్ధి చేస్తున్నది. భద్రత, గోప్యత సమస్యలతోపాటు మా ప్లాట్‌ఫామ్‌లో అందించే లక్షణాలను మరింత మెరుగుపరుస్తున్నాం" అని పీపుల్‌లింక్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ చౌదరి పేర్కొన్నారు.

ఐదు కంపెనీల ఉత్పత్తులను విశ్లేషించిన తరువాత జూలై చివరి నాటికి తుది ఎంపిక చేసిన ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo