శుక్రవారం 30 అక్టోబర్ 2020
Science-technology - Oct 13, 2020 , 20:49:24

కరోనా వైరస్‌కు అంతమెప్పుడు..?

కరోనా వైరస్‌కు అంతమెప్పుడు..?

హైదరాబాద్‌: గతేడాది డిసెంబర్‌లో చైనా నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైంది. పది నెలలు దాటినా ఇంకా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పది లక్షల కంటే ఎక్కువ మంది మృత్యువాతపడ్డారు. చాలామంది వ్యాధిబారిన పడి సతమతమయ్యారు. ఇప్పటికీ ఎంతోమంది మహమ్మారితో ఇబ్బందులుపడుతున్నారు. అయితే, ఇది ఎప్పటికి అంతమవుతుందనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. 

దీని ముగింపును వివరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎలిమినేషన్.. అంటే కొత్త కేసులు తగ్గుతూ.. తగ్గుతూ సున్నాకు రావాలి. మరొకటి ఎరాడికేషన్‌ (నిర్మూలన)..అంటే అంటువ్యాధిని శాశ్వతంగా దూరం చేయడం. వైరస్‌ అనేది ప్రజల మధ్య వ్యాప్తి చెందుతుందని తెలుసు. మన శరీరంలోని కణాలకు వైరస్‌ సోకుతుందని, వైరస్‌ బారినపడ్డ ప్రజలకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ దీని నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఎలా ప్రవర్తిస్తారనే దానిపై దాని వ్యవధిని మనం అంచనా వేయగలం. అయితే, ఇది అసాధ్యమైన పని. వాతావరణ మార్పులకనుగుణంగా మనం ఎలా వ్యవహరిస్తామో దాన్ని బట్టిగూడ భవిష్యత్తులో కరోనా ఎప్పటి వరకు ఉంటుందో అంచనా వేయవచ్చు..

అందరూ కచ్చితంగా భౌతికదూరం పాటిస్తే..?

న్యూజిలాండ్, వియత్నాంలాంటి దేశాల చర్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుంటే.. సమర్థవంతమైన భౌతిక దూర చర్యలు సార్స్‌-సీవోవీ-2 వ్యాప్తిని తగ్గించేందుకు ఒక ప్రభావవంతమైన మార్గం. అలాంటి పద్ధతులు పాటిస్తే వైరస్‌ను కనీస స్థాయిలో నిర్మూలించవచ్చు. అయితే, వివిధ వర్గాల్లోని వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటించకపోవడానికి కొన్ని సంక్లిష్టమైన, వైవిధ్యమైన కారణాలున్నాయి. మరికొంతమంది వ్యక్తిగత, రాజకీయ, నైతిక విలువలతో ప్రభావితమవుతారు. ఇంకొందరు ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రభావితమవుతారు. ప్రజలంతా ఒకేతాటిపై నిల్చుండి భౌతిక దూరం కనుక పాటిస్తే వైరస్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చు. 

సార్స్‌-సీవోవీ-2 కణాలు గాలిలో గంటలపాటు ఉంటాయి. ఉపరితలాలపై కొద్దిరోజులుంటాయి. అయితే, మానవ శరీరంలో ఎన్నిరోజులుంటాయో తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఓ అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన తర్వాత సుమారు తొమ్మిదిరోజులు శరీరంలో వైరస్‌ ఉంటుందని తేలింది. కాగా, కొవిడ్‌ బారినపడ్డ కొంతమందిలో నెల తర్వాత కూడా వైరస్‌ శకలాలు కనిపించాయి. దీన్ని బట్టి వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే ఒకటి లేదా రెండు నెలలు గ్లోబల్‌ ఐసోలేషన్‌ సరిపోతుంది.   

భౌతికదూరం కష్టమే..మరి వైరస్‌ నిర్మూలనకు మరో మార్గం ఏమిటి?

భౌతికదూరం పాటించకుండా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే ఈ ప్రపంచం ముందున్న మరో మార్గం అందరిలో రోగనిరోధక శక్తిని పెంచడం. అయితే, ఇది వ్యక్తికి, వ్యక్తికి తేడా ఉంటుంది. సార్స్‌ సీఓవీ-2ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్‌ వ్యక్తిలో ఎంతకాలం ఉంటుందో తెలియదు.  ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసే కణాలు కొన్ని నెలల వరకు ప్రభావవంతంగా ఉంటాయి. లేదా కొన్ని సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటాయి. టీకా వల్ల రోగనిరోధక శక్తిని పెంచడం సాధ్యమవుతుంది. వ్యాక్సిన్‌ వస్తే కరోనా కేసుల సంఖ్య చాలావేగంగా పడిపోతుంది.  

గత కరోనావైరస్లకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం సమస్యాత్మకంగా ఉండేది. అయితే, సార్స్‌ సీవోవీ-2 విషయంలో ఎంతో పురోగతి ఉంది. 2020 చివరి నాటికి లేదా 2021 ప్రారంభంలో సమర్థవంతమైన టీకాలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చి, తగినంత మోతాదులో ఉత్పత్తి చేయగలిగినా దీని పంపిణీ అనేది సమస్యాత్మకం కానుంది. టీకాను ప్రపంచంలోని ప్రతి మూలకూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎంతమందికి టీకాలు వేయవచ్చనేది ఇప్పుడున్న ప్రశ్న. 

మశూచిని ఉదాహరణంగా తీసుకుంటే దాన్ని నిర్మూలించేందుకు దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఇది 1970 చివరలో విజయవంతమైంది. అయితే, పరిమిత మోతాదులో వ్యాక్సిన్లు, తక్కువ నిధులు ఉండడం వల్ల మశూచి నిర్మూలనకు అంత సమయం పట్టింది. ఇప్పుడు ఆ సమస్య లేదు. తగినంత నిధులు, సహకారం ఉన్నాయి. కనుక, సార్స్‌ సీవోవీ-2ను కొన్నేళ్లలోనే నిర్మూలించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.


కరోనా వైరస్ మనచుట్టూ ఎప్పటికీ ఉంటుందా..?

కరోనా వైరస్‌, దాని వ్యాప్తిపై ఇంకా స్పష్టత లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది పరిశోధకులు కూడా ఊహించలేకపోతున్నారు. దాని వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచీ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్లు అభివృద్ధి చెందుతున్నాయి. చాలా సమర్థవంతమైన టీకాలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయినప్పటికీ వాటిని అందరూ తీసుకునేందుకు ఇష్టపడకపోవచ్చు. కొత్త మందులు మరణాల సంఖ్యను, వ్యాధి దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. కొవిడ్‌-19 వల్ల రాజకీయాలు, సామాజిక పోకడలు, వ్యాపారం, దేశీయ జీవనం కొత్తదనం సంతరించుకుంటాయి. మరణాలు తగ్గడం, వైరస్‌ క్షీణించడం వల్ల మహమ్మారి కనుమరుగు కావచ్చు లేదా వ్యాధికి మనం అలవాటు పడొచ్చు. సైన్స్‌ ఎన్నో అద్భుతాలు చేస్తుంది..ప్రజలే వ్యాధులపై అపనమ్మకం పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకుసాగితే ఇలాంటి మహమ్మారులను తరిమికొట్టవచ్చు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.