మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 08, 2020 , 18:29:05

జీవం పుట్టుక రహస్యం వీడింది..

జీవం పుట్టుక రహస్యం వీడింది..

న్యూ ఢిల్లీ: విశ్వంలోని జీవం పుట్టుక ఎప్పటికీ ఓ రహస్యమే. అయితే, తాజాగా ఓ అధ్యయనం దీని గుట్టు విప్పింది. అంతరిక్షంలోని మరుగుజ్జు నక్షత్రాల్లో భూమిపై ఉన్న జీవుల మూలాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలను నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌ ప్రచురించింది. 

పాలపుంతలోని అన్ని నక్షత్రాలకూ ఓ గడువు తేదీ ఉంటుంది. అవి చనిపోయినపుడు సూపర్నోవా అని పిలిచే పెద్ద పేలుడు సంభవిస్తుంది.  సాధారణంగా ఇంధనం అయిపోయినప్పుడు గురుత్వాకర్షణ బరువు కారణంగా నక్షత్రాలు కూలిపోతాయి. ఇది బలమైన పేలుడును ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, కొన్ని నక్షత్రాలు బ్లాక్‌హోల్‌లోకి వెళ్లిపోతాయి. అలాగే, చాలా నక్షత్రాలు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తెల్లని మరగుజ్జు నక్షత్రాలుగా మారుతాయి. ఇది ఒకప్పుడు నక్షత్రంగా చలామణి అయిన దాని ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది. దీన్నే కోర్‌ అంటారు. 

కోర్‌లో ఏముంది..?

మరుగుజ్జు నక్షత్రాలు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. 99,000 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. బిలియన్ల సంవత్సరా తర్వాత నక్షత్రాలు చల్లబడి మసకబారుతాయి. కోర్ మాత్రమే మిగిలి ఉంటుంది. కోర్‌ చుట్టూ ఉన్న భాగంలోగల ఇతర అవశేషాలు కార్బన్‌ను కలిగి ఉంటాయి. కార్బన్‌ అనేది విశ్వంలో దొరికే నాలుగో అతిపెద్ద రసాయన మూలకం. ప్రతి జీవిలోనూ కార్బన్‌ ఉంటుంది. అయితే, విశ్వంలోని కార్బన్ అంతా నక్షత్రాల ద్వారా విడుదలవుతుందని సైటింస్టులు ఈ అధ్యయనంలో తేల్చారు.  వారు ఇందుకోసం పాలపుంతలోని నక్షత్రాలను పరిశీలించారు.  ఒక నక్షత్రం మరుగుజ్జుగా మారేందుకు ముందు, తర్వాత వాటి డేటాను విశ్లేషించారు. కోర్‌ ద్రవ్యరాశి గతంలో తాము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటున్నదని గుర్తించారు. 

ఈ అధ్యయనం ఆధారంగా, రెండు సోలార్‌ మాస్‌ల కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు మాత్రమే విశ్వంలో కార్బన్‌ వ్యాప్తికి దోహదపడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే సమయంలో  1.5 సోలార్‌ మాస్‌ల కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు కార్బన్‌ను విడుదల చేయలేదని గుర్తించారు.  అలాగే, మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు, 4.6 బిలియన్ సంవత్సరాలకు పైగా విశ్వంలో కార్బన్‌ చిక్కుకుపోయిందని ఈ అధ్యయనం ఆధారంగా సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo