గురువారం 29 అక్టోబర్ 2020
Science-technology - Sep 19, 2020 , 16:44:39

ఈ కాంతితో కొవిడ్‌ వైరస్‌ ఖతం!

ఈ కాంతితో కొవిడ్‌ వైరస్‌ ఖతం!

టోక్యో: కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ను నిరోధించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా, జపాన్‌ శాస్త్రవేత్తలు ఇందులో గణనీయమైన పురోగతిని సాధించారు. 222 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం గల అతినీలలోహిత సీ (అల్ట్రావైలెట్‌ సీ) కాంతి కొవిడ్ -19 వైరస్‌ను సమర్థవంతంగా నాశనం చేస్తోందని గుర్తించారు. అలాగే, ఈ తరంగధైర్ఘ్యంగల కాంతితో మనుషులపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని తేల్చారు. ఈ 222 ఎన్‌ఎం యూవీసీని ఫార్‌ యూవీసీ అని కూడా పిలుస్తారు. సార్స్‌ సీఓవీ-2ను పోలిన వైరస్‌లను మాత్రమే ఈ ఫార్‌ యూవీసీ చంపేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. కానీ, హిరోషిమా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఇది కొవిడ్‌ను కూడా చంపేయగలదని గుర్తించారు. 

హిరోషిమా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వైరస్‌పై 222 ఎన్ఎం యూవీసీని 30 సెకన్లపాటు ఎక్స్పోజర్ చేశారు. దీంతో 99.7 శాతం సార్స్‌ సీఓవీ-2 వైరస్‌ చనిపోయినట్లు తేల్చారు. ఈ 222 ఎన్ఎం యూవీసీ మనుషుల కన్ను, చర్మం బయట పొరలోకి ప్రవేశించదు కనుక లోపలి జీవన కణాలకు ఎలాంటి హాని కలుగదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనికి దవాఖానలతోసహా ఇతర చోట్ల డిస్‌ఇన్‌ఫెక్షన్‌ సిస్టమ్‌గా వాడొచ్చని వారు సూచిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో ప్రచురితమయ్యాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo