సోమవారం 25 మే 2020
Science-technology - Mar 28, 2020 , 19:00:22

హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీలో క‌రోనా ప‌రిశోధ‌న‌ల‌లో పురోగ‌తి !

హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీలో క‌రోనా ప‌రిశోధ‌న‌ల‌లో పురోగ‌తి !

కోవిడ్‌-19 నివార‌ణ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. అలాంటి ప‌రిశోధ‌న‌లు హైద‌రాబాద్‌ విశ్వవిద్యాలయం (యుఒహెచ్)లో కూడా చేస్తున్నారు. నావెల్ క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన స్ట్ర‌క్చ‌ర‌ల్‌, నాన్ స్ట్ర‌క్చ‌ర‌ల్ ప్రోటీన్ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే వ్యాక్సిన్‌పై ప‌రిశోధ‌న‌లు పురోగ‌తి సాధించిన‌ట్టు యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలోని బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అధ్యాపకులు డాక్టర్ సీమా మిశ్రా, నావెల్‌ కరోనా వైరస్ -2 (2019 -nCoV) ప్రయోగాత్మక పరీక్ష కోసం నిర్మాణేత‌ర‌, నిర్మాణాత్మ‌క ప్రోటీన్ల‌కు వ్య‌తిరేకంగా టీ సెల్ ఎపిటోప్స్ అనే సంభావ్య వ్యాక్సిన్‌ను రూపొందించారు. 

సాధారణంగా ఈ టీకా ఆవిష్కరణకు 15 సంవత్సరాలు పడుతుంది. కానీ శ‌క్తివంత‌మైన గ‌ణ‌న సాధ‌నాలు ఉప‌యోగించి దీనిని కేవ‌లం ప‌దిరోజుల్లో రూపొందించారు. వైర‌స్ ను ఆప‌డానికి మాన‌వ క‌ణాలు ఎంత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తాయి అనే అంశాల ఆధారంగా ప్ర‌యోగాల‌ను చేస్తున్న‌ట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్ రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డ‌మే ఈ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి అత్యుత్త‌మ మార్గ‌మ‌ని మిశ్రా తెలిపారు. ప్ర‌స్తుత ప్ర‌యోగాల‌ను మ‌రింత‌గా ప‌రీక్షించి, గ‌ణ‌న‌లు చేయాల్సి ఉంద‌ని ఆమె తెలిపారు.

ఏది ఏమైనా దేశంలోని జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన విద్యాసంస్థ‌లు క‌రోనా పై ప‌రిశోధ‌న‌లు తీవ్ర‌త‌రం చేయ‌డం భార‌తీయులు అంద‌రూ సంతోషించ‌ద‌గ్గ విష‌యం. 


logo