బీజింగ్: అంతరిక్షంపైనా పట్టు సాధించడానికి ఈ మధ్యే చైనా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న విషయం తెలుసు కదా. ఇప్పుడా స్పేస్స్టేషన్కు 50 అడుగుల పొడవైన ఓ రొబోటిక్ చేతిని అమర్చడానికి ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఆదివారం తొలిసారి స్పేస్ వాక్ చేశారు. లియు బోమింగ్, తాంగ్ హాంగ్బోలు స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వీడియోను అక్కడి అధికార టీవీ చానెల్ ప్రసారం చేసింది. స్పేస్ స్టేషన్‌లోని మరో ఆస్ట్రోనాట్ నీ హైషెంగ్ లోపలే ఉన్నాడు. గత నెల 17న ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్లు మూడు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండటానికి వెళ్లారు.
ఈ స్పేస్ స్టేషన్ తొలి మాడ్యూల్‌ను ఏప్రిల్ 29న లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆహారం, ఇంధనంతో ఓ స్పేస్‌క్రాఫ్ట్ అక్కడికి వెళ్లింది. మిగిలిన స్పేస్ స్టేషన్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన రొబోటిక్ చేతిని అమర్చే పనిని ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఆదివారం పూర్తి చేయనున్నారు. 70 టన్నుల స్పేస్ స్టేషన్‌కు మరో రెండు మాడ్యూల్స్‌ను జత చేయడానికి వచ్చే ఏడాది చివరిలోపు మరో 11 లాంచ్‌లను చేయాలని చైనా స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది.