బుధవారం 28 అక్టోబర్ 2020
Science-technology - Jul 18, 2020 , 20:06:41

ఎన్ని ట్విట్టర్ అకౌంట్లు హ్యాకయ్యాయో చెప్పండి

ఎన్ని ట్విట్టర్ అకౌంట్లు హ్యాకయ్యాయో చెప్పండి

న్యూఢిల్లీ : ప్రపంచ ప్రముఖుల ప్రొఫైల్‌లో ఇటీవల హ్యాకింగ్ జరిగిన సంఘటన తర్వాత భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సెర్ట్-ఇన్) ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసింది. అత్యంత విశ్వాసనీయ వర్గాలతో ఈ సమాచారం తెలిసింది. హ్యాకింగ్ ఘటనలో భారతీయులకు చెందిన ఎన్ని అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయో వెల్లడించాలని ఆ నోటీసులో సెర్ట్ ఇన్ ఆదేశించింది. అలాగే, ఈ సంఘటనతో ఎలాంటి సమాచారం ప్రభావితమైందో కూడా చెప్పమని ట్విట్టర్ ను కోరింది. హానికరమైన ట్వీట్లు, లింక్‌లను ఎంతమంది భారతీయ వినియోగదారులు సందర్శించారని, వారి ప్రొఫైల్‌ల ఉల్లంఘన , అనధికారిక ఉపయోగం గురించి బాధిత వినియోగదారులకు తెలియజేశారా అని సెర్ట్ ఇన్.. ట్విట్టర్‌ను అడిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ సంఘటన ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకున్న దిద్దుబాటు చర్యల వివరాలను కోరినప్పటికీ.. ట్విట్టర్ నుండి వెంటనే స్పందన లేదని తెలిసింది.

అనేకమంది ప్రపంచ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపార సంస్థల ఖాతాలను హ్యాక్ చేయడానికి ట్విట్టర్ వ్యవస్థలో ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన నివేదికల తరువాత ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) చర్య తీసుకున్నది.

హ్యాకింగ్ కు గురైనవారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వంటి పెద్ద ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి.


logo