బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Sep 14, 2020 , 22:30:59

కొవిడ్‌నుంచి కోలుకున్నా లక్షణాలు దీర్ఘకాలమే ఉంటాయట..!

కొవిడ్‌నుంచి కోలుకున్నా లక్షణాలు దీర్ఘకాలమే ఉంటాయట..!

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి ఇది ఆందోళన కలిగించే విషయమే. కరోనా బారినుంచి విజయవంతంగా బయటపడ్డవారికి లక్షణాలు దీర్ఘకాలం ఉంటాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఊపిరి ఆడకపోవడం, అలసలాంటి లక్షణాలు కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలామందిలో కనిపిస్తున్నాయి. అలాగే, దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయిన వారిని పరిశీలించిన పరిశోధకులు వారిలో లక్షణాలు చాలాకాలంపాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. వీరిని దీర్ఘకాలం పాటు పరీక్షించాల్సిందేనని అంటున్నారు. అలాంటి రోగులను ఇప్పుడు 'లాంగ్ హాలర్స్' అని పిలుస్తున్నారు. 

అంతం లేని వ్యాధి?

లాంగ్ హాలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఊపిరి ఆడకపోవడం, అలసట, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, హార్ట్‌ బీట్‌ పెరగడం. కొవిడ్‌ నుంచి కోలుకున్న దాదాపు 75 శాతం మంది లాంగ్‌ హాలర్లుగా మారొచ్చని పరిశోధకులు గుర్తించారు. ఎంఈఈఆర్‌క్స్‌ఐవీలో ప్రచురితమైన అధ్యనం ప్రకారం 110 మందిలో 74 శాతం మంది 12 వారాల తరువాత అలసట, ఊపిరి ఆడకపోవడంలాంటి లక్షణాలతో దవాఖానలో చేరారు. ఈ అధ్యయనాన్ని యూకేలోని బ్రిస్టల్‌లోగల మెడికల్‌ కాలేజీ పరిశోధకులు నిర్వహించారు. అలాగే, దక్షిణ కాలిఫోర్నియా వర్సిటీలోని పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనంలో మూడింట ఒకవంతు మందికి ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు వస్తున్నట్లు గుర్తించింది. ఇది ప్రతి పది మందిలో ఒకరికి కనిపిస్తున్నట్లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వేలమంది లాంగ్‌ హాలర్లుగా ఉన్నట్లు తెలుస్తున్నది.  

కరోనా వైరస్‌ కేవలం ఊపిరితిత్తులను మాత్రమే కాదు.. గుండె, మెదడు, రోగనిరోధక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. టీకా వచ్చేదాకా కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు కూడా లక్షణాలతో బాధపడుతూనే ఉంటారని శాస్త్రవేత్తలు తేల్చారు. వారిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వాలు   లాంగ్ హాలర్ల గురించి ఆలోచన చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo