మంగళవారం 27 అక్టోబర్ 2020
Science-technology - Sep 17, 2020 , 20:45:16

కళ్లజోడు పెట్టుకున్నోళ్లకు కరోనా ముప్పు తక్కువేనట..!

కళ్లజోడు పెట్టుకున్నోళ్లకు కరోనా ముప్పు తక్కువేనట..!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొవిడ్‌ కేసులలో మన దేశం బ్రెజిల్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండోస్థానానికి చేరుకుంది. అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కేసులు పెరిగేకొద్దీ ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల శుభ్రతలాంటివి తప్పనిసరిగా జీవితంలో భాగమైపోవాలి. అయితే, కొవిడ్‌-19 ప్రమాదాన్ని తగ్గించడంలో ఇతర అంశాలు కూడా తమవంతు పాత్ర పోషిస్తాయని ఒక చిన్న అధ్యయనంలో తేలింది. కళ్లజోడు రెగ్యులర్‌గా వాడేవారు తక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చైనా సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని  నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు జామా ఆప్తాల్మాలజీలో ప్రచురితమయ్యాయి.  

చైనాలోని సుయిజౌలోని సుయిజౌ జెంగ్డు హాస్పిటల్‌లో జనవరి 27 నుంచి మార్చి 13 వరకు 276 మందిపై అధ్యయనం నిర్వహించారు. పాల్గొన్న వారందరినీ వారు అద్దాలు ధరించారా? ఎందుకు ధరించారు? ఒక రోజులో ఎంతసేపు పెట్టుకుంటున్నారు? అని అడిగారు. అందులో 30 మంది లేదా 11 శాతం మంది అద్దాలు ధరించినట్లు తేలింది. కానీ 5.8 శాతం మంది మాత్రమే రోజుకు 8 గంటలకు పైగా అద్దాలు ధరించారు. అది దగ్గరి చూపు ఉండడం వల్ల అన్ని గంటలు ధరించినట్లు గుర్తించారు. ఈ డేటాను సాధారణ జనాభాతో పోల్చి చూశారు.  జనాభాలో 1/3 వ వంతు మందికి దగ్గరి చూపు ఉందని తేల్చారు. అంటే వారందరూ అద్దాలు ధరిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఆ 1/3 వ వంతు మందిలో చాలా తక్కువ మందికి మాత్రమే కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో కళ్లజోడు ధరించడంవల్ల కొవిడ్‌-19 ప్రమాదాన్ని తగ్గిస్తోందని నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇది కేవలం ఒకే దవాఖానలో నిర్వహించిన అధ్యయనమని, అందుకే కళ్లజోడు కచ్చితంగా కరోనా రాకుండా అడ్డుకుంటుందని చెప్పలేమన్నారు. అయితే, కళ్లజోడు ధరించడం వల్ల కొవిడ్‌ నుంచి కొంతమేర రక్షణ మాత్రం పొందవచ్చని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎపిడెమియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లిసా మరగాకిస్ పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo