ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 05, 2020 , 20:14:45

గతం మర్చిపోతున్నారా.. అయితే నిద్రపోండి..!

గతం మర్చిపోతున్నారా.. అయితే నిద్రపోండి..!

కాలిఫోర్నియా: సరైన నిద్ర మన ఆరోగ్యానికి తోడ్పడుతుందని తెలుసు. అయితే, నిద్ర వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయట. సరైన సమయంలో నిద్రపోయేవారు గతంలో నేర్చుకున్న విషయాలను మర్చిపోరని తాజా అధ్యయనంలో తేలింది. నిద్ర జ్ఞాపకాలను పునర్వ్యస్థీకరించడానికి తోడ్పడుతుందట. అంటే గతంలో నేర్చుకున్న అంశాలకు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు అడ్డుకాకుండా మెదడును ప్రభావితం చేయడంలో నిద్ర అనేది ఉకరిస్తుందట.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిద్రకు, జ్ఞాపకశక్తిగల సంబంధంపై అధ్యయనం చేశారు. ఇందుకోసం నిద్ర, మేల్కొలుపులాంటి వివిధ మెదడు స్థితులను అనుకరించగల గణన నమూనాలను ఉపయోగించారు. నిద్ర కొత్తగా ఎన్కోడ్ చేసిన జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుందని, అలాగే, పాత జ్ఞాపకాల నష్టాన్ని నివారిస్తుందని తేల్చారు. 

‘మనం నిద్రపోయేటప్పుడు మెదడు చాలా బిజీగా ఉంటుంది, పగటిపూట మనం నేర్చుకున్న వాటిని పునరావృతం చేస్తుంది. నిద్ర జ్ఞాపకాలను పునర్వ్యవస్థీకరించడానికి సహాయపడుతుంది. వాటిని అత్యంత సమర్థవంతంగా ప్రదర్శిస్తుంది. జ్ఞాపకాలు అనేవి స్థిరంగా ఉండవు.. అవి చలనశీలత కలిగి ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే కొత్త జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు అంతిమమైనవి కావు. నిద్ర వాటిని నిరంతరం నవీకరిస్తుంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ మాక్సిం బజెనోవ్‌ తెలిపారు. మనం నిద్ర పోతున్నప్పుడు పాత, కొత్త జ్ఞాపకాలు ఆకస్మికంగా రీప్లే చేయబడతాయని, ఇది మర్చిపోకుండా నిరోధించడంతోపాటు జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. మెమొరీ రీప్లే అనేది మెదడులోని అదే సంఖ్యలో న్యూరాన్లు కొత్త, పాత జ్ఞాపకాలను నిల్వ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. 

‘మనం రోజూ చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాం. ఆ విషయాలు.. పాత జ్ఞాపకాలతో పోటీపడతాయి. అయితే, ఇవి రెండూ ఒకదానికొకటి అడ్డుపడకుండా ఉండాలంటే సమయానికనుగుణంగా మనం నిద్రపోవాలి’ అని బజెనోవ్‌ తెలిపారు. ఈ అధ్యయనం ఫలితాలు జ్ఞాపకశక్తి,  అభ్యాసాన్ని మెరుగుపరచడానికి నిద్రలో కొత్త ఉద్దీపన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo